హామీలపై కడియంని నిలదీసిన గ్రామస్తుడు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించడంతో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన ఎదురైంది. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానికుడు నాయిని నరేష్ గౌడ్ నిలదీశారు. ఎన్నికల సమయంలో గ్రామానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, మూడేళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి (Development) ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.
ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తనపై దాడికి ప్రయత్నించారని నాయిని నరేష్ గౌడ్ ఆరోపించారు. దీంతో కార్యక్రమం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత (Tension) నెలకొంది. గ్రామస్తులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసు కేసులు పెడతామని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించారు.
మరోవైపు గ్రామస్తుల ప్రశ్నలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందిస్తూ.. ఏమైనా సమస్యలు ఉంటే తర్వాత మాట్లాడుకుందామని చెప్పినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మరోవైపు నియోజకవర్గంలో రూ.1,600 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే చెబుతున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.