యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం

24-11-2026 | 08:52pm

యాదగిరిగుట్ట, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన పర్వదినమైన కార్తీక పౌర్ణమి(Karthika Purnami) సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple) మంగళవారం భక్తులు పోటెత్తారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సుమారు 70 వేల  మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.

గత సంవత్సరం కంటే అధికంగా  శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలలో భక్తులు పాల్గొన్నారు. పాలకమండలి సభ్యురాలు విజయక్రాంతి మేనేజింగ్ డైరెక్టర్ విజయరాజం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొని పూజలు నిర్వహించారు. కొండపైన శ్రీ  స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.  అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో శివుడికి అభిషేకం నిర్వహించారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ముందుగానే అంచనా వేసిన దేవస్థానం అధికారులు భక్తులకు సకాలంలో వ్రతాలు నిర్వహించుకునే అవకాశం కల్పించేందుకు ఉదయం 4.00 గంటల నుండే శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలను ప్రారంభించారు. సాధారణ బ్యాచ్ విధానానికి పరిమితం కాకుండా భక్తుల రద్దీకి అనుగుణంగా రెండు హాళ్లను బ్యాచ్ సమయముతో కాకుండా రద్దీ మేరకు  వ్రతాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గత సంవత్సరం స్వామి వారి ప్రధాన ఆలయం, పాతగుట్ట దేవస్థానంలో కలిపి 2,266 శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు నిర్వహించగా, ఈ సంవత్సరం మంగళ వారము అయినప్పటికీ ప్రధాన ఆలయంలో 2,150 వ్రతాలు, పాతగుట్ట ఆలయం 260 వ్రతాలు నిర్వహించడం జరిగింది. రెండు కలిపి మొత్తం 2,410 వ్రతాలు నిర్వహించబడ్డాయని దేవస్థానం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 144 వ్రతాలు అధికంగా నిర్వహించబడ్డాయని దేవస్థానం అధికారులు తెలిపారు. 70 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు....

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని సుమారు 70 వేల  మంది భక్తులు యాదగిరిగుట్టకు విచ్చేశారు. వీరిలో 1,400 మంది భక్తులు బ్రేక్ దర్శనం ద్వారా, 8,000 మంది భక్తులు ప్రత్యేక దర్శనం ద్వారా, మిగిలిన 60,600 మంది భక్తులు ధర్మదర్శనం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రధాన ఆలయంతో పాటు శివాలయంలోనూ భక్తుల ప్రత్యేక పూజలు....శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దర్శనం అనంతరం భక్తులు కొండపైన ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. కార్తీక మాస విశిష్టతను పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటూ భక్తులు తమ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించారు.

కొండపైన మాడవీధులలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ప్రధాన ఆలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన కార్తీక దీపం, అఖండ దీపం వద్ద భక్తులు దీపాలను వెలిగించారు.  శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయం వద్ద కూడా కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. 

వైభవంగా శ్రీ స్వామివారి అన్నకూటోత్సవ మహోత్సవం

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం 12.00 గంటల నుండి 2.00 గంటల వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి అత్యంత వైభవంగా అన్నకూటోత్సవ మహోత్సవం నిర్వహించబడింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర విధానాల ప్రకారం ఈ విశేష ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

అన్నకూటోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని నియంత్రించడం మరియు కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించడం దృష్ట్యా మధ్యాహ్నం 12.00 గంటల నుండి 2.00 గంటల వరకు రెండు గంటలపాటు అన్ని రకాల దర్శనాలను, వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కార్యక్రమం పూర్తయిన వెంటనే దర్శనాలను పునఃప్రారంభించి భక్తులకు స్వామివారి దర్శన సౌకర్యం కల్పించారు.

దేవస్థానం భద్రతా సిబ్బంది, స్థానిక ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో వాహనాల నియంత్రణ

అన్నకూటోత్సవం సందర్భంగా దర్శనాలతో పాటు వాహనాల రాకపోకలను కూడా రెండు గంటలపాటు తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. అనంతరం భక్తుల రాకపోకలు, వాహనాల రద్దీ పెరిగిన నేపథ్యంలో దేవస్థానం భద్రతా సిబ్బంది స్థానిక ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.

వైభవంగా ఆకాశదీపం – రెండు ఆలయాల్లో కార్తీక దీపారాధనలు

కార్తీక పౌర్ణమి పర్వదినంలో అత్యంత విశిష్టమైన కార్యక్రమాలలో భాగంగా సాయంత్రం 6.30 గంటలకు ఆకాశదీప కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన ఆలయమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయంలో ప్రత్యేకంగా దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఆకాశ దీపం కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వాణా అధికారి, బోర్డు సభ్యులు గుండా మల్లయ్య  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు దీప ప్రమిదలను వెలిగిస్తూ భక్తిపారవశ్యంలో పాల్గొన్నారు.  కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన వివిధ ధార్మిక కార్యక్రమాలలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మకర్తల మండలి సభ్యులు, విజయ క్రాంతి మేనేజింగ్ డైరెక్టర్  విజయరాజం,  మల్లయ్య  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు