కాచిగూడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు
హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం రేపింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌తో పాటు నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌ను పేల్చివేస్తామంటూ వచ్చిన ఈ-మెయిల్ పోలీసులను అప్రమత్తం చేసింది. లష్కరే తోయిబా పేరుతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఈ నెల 21న రాత్రి 7:13 గంటలకు ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. ముంబై తరహా దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడంతో భద్రతా బలగాలు (Security Forces) అప్రమత్తమయ్యాయి.
బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తులు తమ గుర్తింపును దాచేందుకు డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడీని ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. దీంతో మెయిల్ మూలాలను తెలుసుకునేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. VPN, IP అడ్రస్‌ల ఆధారంగా అనుమానితుల ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
బెదిరింపు నేపథ్యంలో కాచిగూడ రైల్వే స్టేషన్‌తో పాటు నగరంలోని రద్దీ ప్రాంతాలు, ప్రముఖ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా (Surveillance) ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తనిఖీలు ముమ్మరం చేశారు.
లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈ బెదిరింపు వెనుక ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉందా? లేక ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఆకతాయిలు చేసిన పనా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మెయిల్ పంపిన వారి గుర్తింపు, ఉద్దేశాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది.