అథ్లెటిక్స్‌లో ఆసిఫాబాద్‌ అదరహో!

12-10-2026 | 08:06pm

12 పతకాలతో రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌ కైవసం

సత్తా చాటిన గిరిజన క్రీడా పాఠశాల విద్యార్థినులు 

కోచ్‌ విద్యాసాగర్‌ కృషికి ఫలితం

ఆసిఫాబాద్‌,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా(Komuram Bheem Asifabad district) సత్తా చాటింది. జిల్లా కేంద్రంలో అక్టోబర్‌ 11న నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో(State Sub-Junior Athletics Competition) గిరిజన క్రీడా పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. నాలుగు బంగారు, రెండు వెండి, ఆరు కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు సాధించి జిల్లా కీర్తిని చాటారు. ములుగు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది.

కోచ్‌ కృషికి దక్కిన ప్రతిఫలం

ఈ విజయానికి అథ్లెటిక్స్‌ కోచ్‌ విద్యాసాగర్‌ నిరంతర కృషి తోడైంది. క్రీడాకారిణులకు ప్రత్యేక శిక్షణ అందించడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు గిరిజన క్రీడా పాఠశాల మైదానం అభివృద్ధి, ట్రాక్‌ మార్కింగ్‌, జావెలిన్‌ త్రో, లాంగ్‌జంప్‌ పిట్ల తయారీ పనులను సమన్వయం చేస్తూ విజయవంతంగా నిర్వహించారు. శిక్షణ, ప్రణాళికాబద్ధమైన కృషి ఫలితంగా విద్యార్థినులు ఛాంపియన్‌షిప్‌ను సాధించారు.

విద్యార్థినులకు అభినందనల వెల్లువ

ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించిన విద్యార్థినులను జిల్లా కలెక్టర్‌ కె.హరిత, ఐటీడీఏ పీఓ మంద మకరంద్‌, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జాదవ్‌ అంబాజీ, ఏసీఎంఓ ఉద్ధవ్‌, డీఎస్‌ఓ షేకు, జీసీడీఓ శకుంతల, ప్రధానోపాధ్యాయుడు లింబారావు, వ్యాయామ ఉపాధ్యాయుడు మీనా రెడ్డి, ఎస్సీఆర్టీ రవీందర్‌, హెచ్‌డబ్ల్యూఓ విజయలక్ష్మి, హ్యాండ్‌బాల్‌ కోచ్‌ అరవింద్‌, ఖోఖో కోచ్‌ తిరుమల్‌, పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోట్నాక విజయ్‌, ప్రధాన కార్యదర్శి గుండం లక్ష్మణ్‌ మాట్లాడుతూ, విద్యార్థినులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడా పాఠశాలకు అసోసియేషన్‌ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు