క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపాలి
కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రజావాణిలో(Prajavani) ప్రజలు సమర్పించే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె.హరిత (District Collector K. Haritha) అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ భూమికి పట్టా మంజూరు చేయాలని, కుటుంబానికి ఉపాధి కల్పించాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, వితంతు పింఛన్లు మంజూరు చేయాలని,
భూమి పట్టా మార్పిడి చేయాలని, నూతన పాస్ పుస్తకాలు జారీ చేయాలని కోరుతూ వివిధ మండలాలకు చెందిన ప్రజలు దరఖాస్తులు సమర్పించారు.అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. గత ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.ప్రజావాణికి వచ్చే అర్జీదారులు తమ గ్రామాల్లో నిర్వహించే శిబిరాల ద్వారా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద రూ.5 లక్షల బీమా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.