ఫిర్యాదులపై స్పందించని ఆబ్కారీ సీఐపై జిల్లా అధికారికి ఫిర్యాదు
అక్రమ పర్మిట్ రూములపై చర్యలు తీసుకోకుంటే మంత్రి దిష్టిబొమ్మ దహనం చేస్తాం: కొలిపాక సమ్మయ్య
హుజురాబాద్,నవంబర్23: (విజయక్రాంతి) హుజురాబాద్ పట్టణ, మండల పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న వైన్స్ షాపుల అక్రమ పర్మిట్ రూములపై(Illegal permit room for wine shops) చర్యలు తీసుకోవాలని స్థానిక ఆబ్కారీ సీఐకి ఫిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో జిల్లా ఆబ్కారీ సూపరింటెండెంట్‌కు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినట్లు ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణంలోని వరంగల్, కరీంనగర్ ప్రధాన రహదారులతో పాటు జమ్మికుంట రోడ్డులోని వైన్స్ షాపులు, చెల్పూర్ గ్రామంలోని వైన్స్‌ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూములను విస్తరించారని ఆరోపించారు. పెద్దపెద్ద షెడ్లు, షట్టర్లు ఏర్పాటు చేసి వంటగదులను సైతం నిర్వహిస్తూ నాసిరకం ఆహార పదార్థాలు, మాంసాహార వంటకాలను తయారుచేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన రహదారుల పక్కనే ఉన్న ఈ పర్మిట్ రూముల ముందు మద్యం సేవించేందుకు వచ్చే వారు గంటల తరబడి వాహనాలను నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో గుర్గు వైన్స్ ఎదుట జరిగిన ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుచేశారు.
అక్రమ పర్మిట్ రూములపై ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ఆబ్కారీ అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పర్మిట్ రూములపై, ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన సంబంధిత అధికారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యానికి నిరసనగా ఆబ్కారీ శాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేస్తామని కొలిపాక సమ్మయ్య హెచ్చరించారు.