ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలి
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో(Indiramma Housing Scheme) పూర్తి పారదర్శకత పాటించి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పథకం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి డిమాండ్ చేశారు.లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం, పక్షపాతం, అవకతవకలకు తావులేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని కోరారు.
అర్హులైన పేదల పేర్లను పారదర్శకంగా ప్రకటించాలని, అనర్హులు జాబితాలో చేరకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు రాని వారికి ఫిర్యాదు, అభ్యంతరాలు తెలిపే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన అర్హులకు చేరినప్పుడే దాని ఉద్దేశం నెరవేరుతుందని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిరె ప్రకాష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కోదురుపాక మహేష్, ధర్మయి రాకేష్ పాల్గొన్నారు.