6 September, 2026 | 1:03 PM

కుడి కాలువ కూలినా పట్టించుకోరా?

06-09-2026 | 12:06pm

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి: డీవైఎఫ్ఐ

ఆసిఫాబాద్(విజయక్రాంతి): మాణిక్ గూడ గ్రామపంచాయతీ సమీపంలోని కుమురం భీం ప్రాజెక్ట్(Kumuram Bheem Project) కుడి కాలువ అకాల వర్షాలకు దెబ్బతిని సీసీ రోడ్డు కొట్టుకుపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాలువ అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక బడ్జెట్(Collector's Special Budget) నుంచి సుమారు రూ.42 లక్షలు కేటాయించి కాంట్రాక్టర్‌కు అప్పగించినప్పటికీ, పనులు నాసిరకంగా ఉండటంతోనే కాలువ దెబ్బతిన్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

కాలువ ప్రభావం కొత్తగా నిర్మించిన గ్రామపంచాయతీ, పాఠశాల భవనం, ఇళ్ల వరకు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని డీవైఎఫ్ఐ నాయకులు(DYFI leaders) తెలిపారు. కలెక్టర్, ఇన్‌చార్జి మంత్రి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాలువ పనులు పూర్తి చేసి, నాసిరకం పనులకు బాధ్యుడైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యపై అధికారులు స్పందించకపోతే గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్, ఎమ్మెల్యే, మంత్రి ఇళ్ల ముట్టడి చేపడతామని డీవైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గొడిసెల కార్తీక్, జిల్లా కోశాధికారి దుర్గం నిఖిల్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు