విద్యుత్ కోతలతో అల్లాడుతున్న జనం
లోడ్ ఎక్కువగా ఉన్న సమయంలోనే విద్యుత్ నిలిపివేత
ములుగు, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా విద్యుత్(Power Cuts) సరఫరాలో తీవ్ర అంతరాయం జరుగుతుంది. గతంలో ఎన్నడు లేని విధంగా రాత్రి 7 గంటల తర్వాత విద్యుత్ కోతలు విధిస్తుండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ వినియోగం(Electricity consumption) ఎక్కువగా ఉన్న సమయంలోనే విద్యుత్ కోత విధిస్తుండటం వినియోగదారులను తీవ్ర అసహనానికి, ఆందోళనకు గురిచేస్తుంది. ఎల్ నీనో ప్రభావంతో(El Niño effect) తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం రెట్టింపు అవుతుంది.
ఈ క్రమంలో సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఉక్కపోత కారణంగా ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా రెట్టింపు అయింది. అయితే వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా(Power supply) లేకపోవడంతో అధికారులు కోతలు విధిస్తున్నట్లు సమాచారం. గతంలో మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్ కోతల సమయాలను అధికారులు సోషల్ మీడియా వేదికగా సమాచారం అందించేవారు. కానీ గత వారం రోజులుగా ఇలాంటి సమాచారం లేకుండానే అధికారులు కోతలు విధిస్తుండటం విద్యుత్ వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తుంది. ఏది ఏమైనా విద్యుత్ కోతల పట్ల అధికారులు ముందస్తుగా సమాచారం అందిస్తే వినియోగదారులు అందుకు తగ్గట్టుగా వారి అవసరాలు మార్చుకునే అవకాశం ఉంది.






