హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి

21-09-2026 | 07:20pm

రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(Special Intensive Revision)లో భాగంగా మ్యాపింగ్ కాని, అనమలిస్ ఓటర్లకు నోటీసులు జారీ చేసి హియరింగ్ ప్రక్రియ(hearing process)ను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి(Electoral Officer Sudarshan Reddy) అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, రాజస్వ మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి మాట్లాడుతూ అక్టోబర్ 20వ తేదీలోగా అనమలిస్ జాబితాలో గల ఓటర్లు, మ్యాపింగ్ కాని ఓటర్ల హియరింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. సంబంధిత ఓటర్లు సమర్పించిన వివరాలను డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేసేలా పర్యవేక్షించాలని తెలిపారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని, ఓటరు నమోదు కోసం అందించే ఫారం 6 తో డిక్లరేషన్ తీసుకోవాలని, హియరింగ్ ప్రక్రియ ప్రశాంతంగా చేపట్టాలని తెలిపారు.కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1 లక్ష 676 నోటీసులను సంబంధిత ఓటర్లకు అందించడం జరిగిందని, 56 వేల 538 మంది ఓటర్ల హియరింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, అక్టోబర్ 15వ తేదీలోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారంతో హియరింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు