చదువుపై దృష్టి పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోండి
గురుకుల విద్యార్థులకు మాజీ అధికారి పిఎస్ఎన్ మూర్తి పిలుపు
ఘట్ కేసర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : విద్యార్థులు(Students) ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించే వరకు పట్టుదలతో కష్టపడి చదవాలని ఐడిఏఎస్ మాజీ అధికారి, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఆధార్) పిఎస్ఎన్ మూర్తి(PSN Murthy) అన్నారు. ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ డివిజన్ పరిధి, అంకుశాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, మహేంద్ర హిల్స్ లో సోమవారం విద్యార్థుల సాధికారత, వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షలు, కెరీర్ ప్రణాళికపై ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన మూర్తి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. తాను కూడా గురుకుల విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన అనుభవాలను పంచుకుని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమవ్వాలని, ఉన్నత విద్య, ఉద్యోగం, కెరీర్ అవకాశాలపై స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. విద్యార్థులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
కార్యక్రమంలో లతా రాజా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కె.కె. రాజా, చైతన్య ఆర్ట్స్ థియేటర్ ప్రతినిధులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. కళారంగంలో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ అసిరెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఓ ఎస్ డాక్టర్ స్నేహలతకు ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.