చెల్పూర్‌ను కమ్మేస్తున్న బూడిద
- కేటీపీపీ ‘సైలో’ పై భాగంలో లీకేజీ
- పది రోజులుగా ఇదే పరిస్థితి
- ఇబ్బందులు పడుతున్న పరిసర గ్రామాల ప్రజలు
- పట్టించుకోని అధికారులు
గణపురం, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి): నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(Kakatiya Thermal Power Station) కేటీపీపీ ‘సైలో’ నుండి బూడిద విపరీతంగా బయటకు వస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లీకేజీ అయిన బూడిద గాల్లో కలిసిపోయి ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకునే పరిస్థితి నెలకొంది. గత పది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
‘సైలో’ విభాగంలో పనిచేసే సుమారు 15 మంది కార్మికుల పరిస్థితి కూడా మరింత దయనీయంగా మారిందని చెబుతున్నారు. ‘సైలో’ పైకప్పు సరిగా లేకపోవడంతో ప్లాంట్ నుండి వచ్చే బూడిద గాల్లోకి ఎగిసిపడుతోందని, దీంతో పరిసరాల్లో ఎక్కడ చూసినా బూడిద కనిపిస్తుందని చెబుతున్నారు. థర్మల్ కేంద్రం సమీప రోడ్లపై వెళ్లే వాహనదారులు, నివాసం ఉండే ప్రజలు లీకేజీ వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెన్ కో యాజమాన్యానికి బూడిద రూపంలో కోట్లాది రూపాయలు టెండర్ల ద్వారా వస్తున్నప్పటికీ నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
బూడిద లీకేజీ విషయం తెలిసినా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే బూడిద మొత్తం చెల్పూర్ గ్రామాన్ని కమ్మేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా పరిసర గ్రామాల ప్రజల, ఉద్యోగుల కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెంటనే సైలో పైభాగంలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
బూడిదను నియంత్రించాలి
కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కెటిపిపి సైలో ద్వారా బూడిద బయటకు రావడంతో పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సైలో పై భాగంలో పూర్తిస్థాయి మరమ్మతులు చేయకపోవడం వల్ల బూడిద బయటకు వస్తుంది. చెల్పూర్ ప్రధాన రహదారి దాకా బూడిద గాలిలోకి లేచి వస్తుంది. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టి పరిసర గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
నర్సయ్య, గ్రామస్థుడు, చెల్పూర్