యూఎల్‌సీపై కదలిక

28-09-2026 | 05:25am
  1. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి గ్రీన్‌సిగ్నల్
  2. అర్హత ఉన్న ఆస్తుల క్రమబద్ధీకరణ 
  3. 22 ఏ సమస్యల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ విధానం
  4. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో పెండింగ్ భూ సమస్యలపై ప్రభుత్వం(Government) మరో కీలక నిర్ణ యం తీసుకుంది. దశాబ్దాలుగా వివిధ కారణాలతో పరిష్కారానికి నోచుకోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌సీ) దరఖాస్తులకు మోక్షం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Revenue Minister Ponguleti Srinivasa Reddy) ఆదివారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

యూఎల్‌సీ పెండింగ్ దరఖాస్తుల విషయంలో 2016 సంవత్సరంలో జీవోలు జారీ చేసినప్పటికీ, అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఫలితంగా వేలా ది దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం స్పందించి యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారం కోసం తాజా గా మెమో నం.48062 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. జీవో నెం.455, 456, 747, 92 పరిధిలో ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి,

అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా భూ సమస్యలపై ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఇందులో భాగంగానే 22ఏకు సంబంధించిన అంశాలపైన దృష్టి సారించిందన్నారు. 22ఏ సమస్యలపై ఇప్పటికే మూడు కీలక నిర్ణయాలు తీసుకుందని, జీవో 118, జీవో 76లకు  అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు.

22ఏ జాబితాలో ఆస్తులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపాలిటీల అనుమతులు పొందిన ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొన్నారు. 22ఏకు సంబంధించిన మిగితా అంశాలను కూడా  ఫాస్ట్ట్రాక్ విధానంలో దశలవారీగా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తలు