వట్టెం రహదారిపై బహిర్భూమి.. ప్రయాణికులకు ఇక్కట్లు
బిజినేపల్లి: గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాన్ని(Government construction of toilets) ప్రోత్సహిస్తున్నప్పటికీ.. కొందరు బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయడం సమస్యగా మారుతోంది. బిజినేపల్లి మండలం(Bijinepally Mandal) వట్టెం గ్రామం నుంచి వెల్గొండకు వెళ్లే ప్రధాన రహదారిపై కొందరు బహిర్భూమికి వెళ్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ రహదారి మీదుగా నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు దుర్వాసనతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రహదారి పక్కనే బహిరంగ మలవిసర్జన చేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరుగుదొడ్లు(Toilets) అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు వాటిని వినియోగించకుండా రహదారులపైనే బహిర్భూమికి వెళ్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
బహిరంగ మలవిసర్జనతో ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడటంతో పాటు గ్రామ పరిసరాల పరిశుభ్రత కూడా దెబ్బతింటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను గ్రామపంచాయతీ అధికారులు వెంటనే గుర్తించి రహదారిపై బహిర్భూమి చేయకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించాలని ప్రయాణికులు, గ్రామస్తులు కోరుతున్నారు.