నాయనా పులి వచ్చే..!

24-10-2026 | 05:15am

ఏఐ టెక్నాలజీతో పులి ఫోటోలను వైరల్ చేసిన పిల్లలు

మహబూబాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ‘నాయనా.. పులి వస్తుంది జాగ్రత్త!’ అంటూ ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాటలు అబద్ధమని కొట్టిపారేస్తే.. ఇప్పుడు ఏకంగా ఏఐ(AI) సాంకేతికతతో పులినే సృష్టించి జనాన్ని భయపెట్టే పరిస్థితి నెలకొంది. కృత్రిమ మేధస్సుతో రూపొందించిన పులి ఫొటోలను నిజమైనవిగా నమ్మేలా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేయడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పులి సంచరిస్తోందన్న ప్రచారంతో అటవీ ప్రాంతాల పరిసర గ్రామాల్లో ఆందోళనకు దారితీసిన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) నరసింహులపేట మండలం పెద్దనాగారం స్టేజి వద్ద చోటుచేసుకుంది.

ఏఐతో పులి.. వాట్సాప్‌లో కలకలం!

సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించాల్సిన పిల్లలు.. అదే సాంకేతికతతో పులి చిత్రాన్ని సృష్టించి, అది పెద్దనాగారం స్టేజి వద్ద సంచరిస్తున్నట్లు వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు. ఫొటో నిజమైనదేనని భావించిన పలువురు స్థానికులు పులి ఎక్కడి నుంచి వచ్చిందోనని ఆందోళనకు గురయ్యారు. పశువులు, వ్యవసాయ పనుల కోసం బయటకు వెళ్లే ప్రజలకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమోనన్న భయం మొదలైంది.

సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రతి చిత్రాన్నీ నిజమని నమ్మితే ఎంతటి గందరగోళం ఏర్పడుతుందో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. పులి సంచారంపై ప్రచారం కలకలం రేపడంతో అటవీ శాఖ, పోలీసు శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వైరల్గా మారిన ఫొటోలను పరిశీలించి, అక్కడ పులి సంచరించిందన్న ప్రచారానికి ఆధారాలు లేవని, అవి ఏఐ సాంకేతికతతో రూపొందించిన నకిలీ చిత్రాలని నిర్ధారించారు. ఈ ప్రచారానికి కారణమైన ఇద్దరు పిల్లలను గుర్తించి మందలించి వదిలేశారు.

అబద్ధపు ప్రచారంతో అనర్థాలెన్నో!

ఒకప్పుడు ‘నాయనా.. పులి వచ్చింది!’ అంటూ పదేపదే అబద్ధం చెప్పి చివరకు నిజంగా పులి వచ్చినప్పుడు ఎవరూ నమ్మని కథను పెద్దలు పిల్లలకు చెప్పేవారు. ఆ కథలోని నీతి అబద్ధపు మాటలతో నమ్మకాన్ని కోల్పోవద్దన్నది. కానీ ఇప్పుడు పరిస్థితి మరో మలుపు తిరిగింది. పులి లేకపోయినా ఉందన్నట్లు ఏఐ చిత్రాలతో భయాందోళనలు సృష్టించే స్థాయికి సాంకేతికత చేరింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజలను భయపెట్టడమే కాకుండా, అధికార యంత్రాంగం విలువైన సమయాన్ని వెచ్చించేలా చేస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో నిజమైన సమాచారాన్ని గుర్తించడం కూడా కష్టతరమవుతుంది.

నిజమా.. నకిలీనా.. నిర్ధారించుకోవాలి!

ఏఐ సాంకేతికతతో ఫొటోలు, వీడియోలు సులభంగా సృష్టించగలుగుతున్న ప్రస్తుత కాలంలో వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వన్యప్రాణుల సంచారం, ప్రమాదాలు, అత్యవసర ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వర్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలి. పిల్లలకు సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడం, తప్పుడు ప్రచారాల వల్ల కలిగే నష్టాలను వివరించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత. పులి లేని చోట పులి ఉందంటూ భయపెట్టడం సరదా కావొచ్చు.. కానీ ఆ సరదా సమాజంలో భయాందోళనలు సృష్టించే విధంగా ఉండొద్దు.

మరిన్ని వార్తలు