పీపీఎఫ్ పేరుతో వసూళ్ల పర్వం?!

23-10-2026 | 05:10am

కేసముద్రం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తీరుపై తీవ్ర ఆరోపణలు

పండుగ పేరుతో పైసల సేకరణ వెనుక అసలు కథేంటి?

కేసముద్రం, అక్టోబర్ 22 (విజయక్రాంతి): పండుగ అంటే సంబరాల సందడి.. కానీ కేసముద్రం(Kesamudram)లో దసరా మామూళ్ల పేరుతో డబ్బుల సేకరణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రెస్, పోలీస్, ఫైర్ (పీ.పీ.ఎఫ్)శాఖల వారికి దసరా సందర్భంగా మామూళ్లు ఇవ్వాలంటూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్(Rice Millers Association) ఆధ్వర్యంలో ఒక్కో మిల్లు నుంచి 15 వేల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలా వసూలు చేసిన డబ్బును కొందరికి మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దసరా పండగకి ముందు పంపిణీ చేసి, మా జోలికి రాకూడదని, మాకు ఏదైనా ఆపద కలగకుండా చూడాలంటూ, మచ్చిక చేసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. ప్రజల భద్రత, విధి నిర్వహణతో ముడిపడిన శాఖల పేర్లతో వసూళ్లు చేయాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

శాఖల పేర్లు చెప్పి వసూళ్లా?

దసరా పండుగను అడ్డం పెట్టుకుని మామూళ్ల సేకరణకు తెరలేపారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల అసోసియేషన్ ఏర్పాటు చేసి డబ్బులు సేకరించడంలో ఎవరి పాత్ర ఎంత? ఈ వసూళ్లకు ఆయా శాఖల అధికారుల అనుమతి ఉందా? లేక వారి పేర్లను ఉపయోగించుకుని కొందరు తమంతట తామే నగదు సేకరించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వసూలైన మొత్తమెంత? ఆ నగదు ఎవరికి చేరింది? లెక్కాపత్రాలు ఉన్నాయా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

బాధ్యతాయుత శాఖల పేర్లతో బేరసారాలా?

ప్రజలకు వార్తలు అందించే ప్రెస్, శాంతిభద్రతలు కాపాడే పోలీస్, అగ్నిప్రమాదాల నుంచి ప్రాణాలు, ఆస్తులను రక్షించే ఫైర్ శాఖలు కీలకమైనవి. అలాంటి వ్యవస్థల పేర్లను మామూళ్ల వసూళ్లకు ఉపయోగించినట్లు ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. విధి నిర్వహణకు పండుగ మామూళ్లతో సంబంధమేంటి? ఎవరి ప్రోద్బలంతో ఈ వ్యవహారం సాగింది? డబ్బులు ఇవ్వాలంటూ ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

విచారణతోనే బండారం బయటపడాలి!

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, వసూళ్ల వెనుక ఉన్న వాస్తవాలను నిగ్గుతేల్చాలని స్థానికులు కోరుతున్నారు. అసోసియేషన్ నుంచి వివరణ తీసుకుని, డబ్బులు ఇచ్చినవారు, సేకరించినవారు, నగదు అందుకున్నవారి వివరాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. శాఖల పేర్లను అనుమతి లేకుండా ఉపయోగించినట్లయితే ఆ విషయాన్నీ స్పష్టం చేయాలి. పండుగల పేరుతో వసూళ్లకు తెరపడేదెప్పుడనే ప్రశ్న ఇప్పుడు కేసముద్రంలో వ్యక్తం అవుతుంది.

మాకు ఎలాంటి సంబంధం లేదు

మేం ఎవరిని డబ్బులు అడగలేదు. అలాగని వసూలు చేయమని కూడా చెప్పలేదు. పోలీసు శాఖ పేరుతో ఎవరైనా ఇలాంటి వ్యవహారానికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఈ అంశం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా నేతను వివరణ కూడా కోరాను. 

 క్రాంతి కిరణ్, ఎస్ ఐ, కేసముద్రం

మరిన్ని వార్తలు