తొలగుతున్న అడ్డంకులు..

03-10-2026 | 05:25am

విస్తరణ పనులు ముమ్మరం 

కేసముద్రం, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీలో(Kesamudram Municipality) రోడ్ల విస్తరణ పనులకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. దీనితో రోడ్ల విస్తరణ పనులు(Road widening works) ముమ్మరంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. కేసముద్రం మండలవాసి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy) కృషితో కేసముద్రం మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుగా నియమితుడు కాగానే పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయలను మంజూరు చేయించారు.

ఇందులో ప్రధానంగా కోరుకొండపల్లి క్రాస్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు, మహాత్మ జ్యోతిబాపూలే సర్కిల్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు, పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి ఆర్ అండ్ బి అతిథి గృహం వరకు, అలాగే బైపాస్ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయించారు. రోడ్ల వెడల్పు తో పాటు డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. అయితే కొందరు రోడ్ల విస్తరణలో తమ ఇండ్లు, వాణిజ్య సముదాయాలు కోల్పోతున్నామని, తమకు నష్టపరిహారం చెల్లించాలని, విస్తరణ విస్తీర్ణం తగ్గించాలని అడ్డు తగిలారు.

దీనితో కొంతకాలం పాటు పనుల నిర్వహణకు ఆటంకంగా మారింది. చాలామంది సొంతంగానే రోడ్ల విస్తరణ కోసం తమ ఇండ్లు, వాణిజ్యసముదా యాలను తొలగించి సెట్ బ్యాక్ అయ్యారు. దీంతో అక్కడ పనులు చేపట్టి మిగిలిన చోట వదిలిపెట్టారు. దీనితో పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు అసంపూర్తిగా మారి పోయాయి. రోడ్ల విస్తరణ సరిగా లేకపోవడం వల్ల ప్రజలకు, వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు గృహ, వాణిజ్య సముదాయాల యజమానుల్లో కొంత మార్పు వచ్చింది. స్వచ్ఛందంగా అభివృద్ధికి ముందుకు వస్తున్నారు.

లక్షల రూపాయల విలువైన తమ గృహ, వాణిజ్య సముదాయాలను తొలగిస్తున్నారు. పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద ప్రధానంగా అడ్డుగా ఉన్న అభిరామ్ లాడ్జ్ లో కొంత భాగాన్ని యజమాని పోలేపల్లి నెహ్రు రెడ్డి స్వచ్ఛందంగా తొలగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. దాదాపు 30 లక్షల రూపాయల నష్టం వాటిల్లినప్పటికీ, 16 అడుగుల సెట్ బ్యాక్ కావడంతో అక్కడ జంక్షన్ అభివృద్ధికి కొంత అడ్డు తొలగిపోయింది. ఈ తరహాలో అక్కడ మరికొందరు సెట్ బ్యాక్ కావాల్సి ఉంది. సెట్ బ్యాక్ అయినచోట డ్రైనేజీ పనులు, విద్యుత్తు లైన్ల విస్తరణ, రోడ్డు పనులు నిర్వహించడానికి ఆర్ అండ్ బి శాఖ ముమ్మరంగా చర్యలు చేపట్టింది. 

దసరా పండుగకు సెంట్రల్ లైటింగ్ వెలుగులు

కేసముద్రం పట్టణంలో ఈ దసరా పండగ నాటికి సెంట్రల్ లైటింగ్ వెలుగులు విరజిమ్మె విధంగా పనులను యుద్ధ ప్రాతిపదికగా నిర్వ హిస్తున్నారు. రోడ్ల విస్తరణకు ముందుగానే మార్కింగ్ ఇచ్చి డివైడర్ల నిర్మాణం పూర్తి చేశారు. డివైడర్ల మధ్య సెంట్రల్ లైటింగ్ కోసం విద్యుత్ స్తంభాలను నాటి లైటింగ్ కోసం ప్రత్యేక లైట్లు బిగిస్తున్నారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రస్తుతం చురుకుగా సాగుతున్నాయి. కొద్ది రోజుల్లో పట్టణం రాత్రి పూట విద్యుత్ వెలుగులు విరజిమ్మె అవకాశం ఏర్పడింది.

మరిన్ని వార్తలు