ఆదివాసిలపై ఫారెస్ట్ దాడులు ఆపాలి
అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): ఆదివాసి గిరిజనులపై ఫారెస్టు అధికారులు దాడులు ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బోడంకి చందు(CPM District Secretary Bodanki Chandu) డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ(CPM Mancherial District Committee) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెన్నెల మండలంలోని కోనంపేట గ్రామ ఆదివాసీలు సుమారు 30 ఏండ్లగా సాగు చేసుకుంటున్న భూమిలో ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పేరుతో మొక్కలు నాటడం ఆపాలని కోరిన ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు దాడి చేసి, అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు.
ఆదివాసీలపై దాడులు జరుగుతున్నా, ప్రభుత్వాలు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, వన్య ప్రాణులకు ఇచ్చిన ప్రాముఖ్యత కూడా ఆదివాసులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసులకు న్యాయం చేయని పక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రయ్యకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ప్రకాష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ వెంకట స్వామి, నాయకులు పాయిరాల రాములు, డోర్కె మోహన్ తదితరులు పాల్గొన్నారు.