సాలూరలో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు

13-10-2026 | 12:22am

​సాలూర,(విజయక్రాంతి): తెలంగాణ జీవన వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) సాలూర మండల కేంద్రంలో సోమవారం అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా సాగాసాయి. ఊరంతా పసుపు, కుంకుమలు, పూల పరిమళాలతో కళకళలాడింది. ​ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుంటూ మండలంలోని మహిళలందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. వివిధ రకాల పూలతో అత్యంత అట్టహాసంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను చేతబూని.. గ్రామ పోలీసు పటేల్‌ వెంకట్ పటేల్ నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

​గడపల వద్ద గౌరమ్మను కొలువుదీర్చి, మహిళలందరూ కలిసికట్టుగా అడుగులో అడుగు వేస్తూ కోలాటాలు, బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. "గౌరమ్మ.. ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో" అంటూ వారు పడిన పాటలు, చప్పట్ల చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. తరతరాల ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా సాగిన ఈ సామూహిక బతుకమ్మ వేడుకలు స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పల్లెసీమల సంస్కృతిని, ఐక్యతను చాటిన ఈ సంబరాలు అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అనంతరం గ్రామా శివారులో గల బతుకమ్మ కుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

మరిన్ని వార్తలు