సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కోవాలి
తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సూపర్ ఎల్‌నినో ప్రభావం(Super El Niño) ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని, అనేక ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sriharsha) వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులతో మాట్లాడి యాసంగి 2026–27 పంటల సాగు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని రైతు వేదికల నుంచి రైతులు కూడా ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోవడం, సాగునీటి లభ్యత పరిమితంగా ఉండటంతో రైతులు యాసంగి 2026–27 పంటల సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
నీటి లభ్యత లేని ప్రాంతాల్లో సాగుకు దూరంగా ఉండాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు సమష్టిగా పనిచేయాలనిపిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరి నుంచే రైతులకుఅవగాహన కల్పిస్తోందని తెలిపారు.
పంటలకు నీటి సరఫరా, విద్యుత్ లభ్యతపై అధికారులు రైతులకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సమాచారం అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఏ ప్రాంతంలో ఎంత నీరు అందుబాటులో ఉంది, ఎంత విద్యుత్ సరఫరా చేయగలమనే వివరాలను స్పష్టంగా తెలియజేయాలని తెలిపారు..ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి ప్రసాద్, డి సి ఓ శ్రీ మాల, ఎస్సీ ఎన్పీడీసీఎల్ గంగాధర్ ,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.