మేకల కాపరులపై బీట్ అధికారి దాడి!
కోటపల్లి, (విజయక్రాంతి): అడవిలో మేకలు మేపుకుంటున్న ఆదివాసీ కాపరులపై బొప్పారం బీట్ అధికారి తిరుపతి విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మంచిర్యాల జిల్లా(Mancherial district) కోటపల్లి మండలం ఆల్గామ గ్రామానికి చెందిన కోర్తె సంతోష్, సంపత్, ఓజన్న ఆదివారం మేకలు మేపేందుకు అడవికి వెళ్లగా, తిరుపతి తన సిబ్బందితో వచ్చి సంతోష్, ఓజన్నపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. దాడిలో తొడలు, చేతులు, నడుముపై తీవ్రంగా కొట్టడంతో నడవలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకుంటే చేసుకోండి, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ అధికారి దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఆదివాసీలపై అటవీ అధికారుల దౌర్జన్యాలు ఆపాలని, తిరుపతిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మేకల కాపరులు డిమాండ్ చేశారు.