ఏసీబీకి చిక్కిన జిపిఓ
భీమిని, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దపేట గ్రామంలో అవినీతికి పాల్పడిన జీపీవో దుర్గాప్రసాద్(GPO Durgaprasad)ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ అధికారి మధు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం పెద్దపేట గ్రామానికి చెందిన ఓ రైతు పెద్దపేట శివారులోని తన భూమినీ పట్టా చేయడానికి కోరగా, దీనికి గ్రామ పంచాయతీ జీపీవో దుర్గాప్రసాద్ బేరం ఆడీ రూ. 30 వేలు డిస్కౌంట్ ఇచ్చి రూ. 1.50 లక్షలకు ఒప్పుకున్నాడు. ఇందులో ముందుగా అడ్వాన్స్ కింద రూ. 20 వేలు తీసుకున్నాడన్నారు.
జిపిఓకు మధ్యవర్తిగా భీమిని మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట కిరాణా షాప్ కడుపుకుంటూ రెవెన్యూ కేసుల్లో మధ్యవర్తిగా ఉన్న బిట్టుర్పల్లి గ్రామానికి చెందిన పోతురాజుల రాజేందర్ అనే వ్యక్తి వ్యవహరించాడన్నారు. ఈ విషయంపై రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం మంగళవారం పెద్దపేట గ్రామంలో రైతు వద్ద నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దుర్గాప్రసాద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం భీమిని తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. కోర్టులో హాజరుపరచనున్నట్లు వివరాలు వెల్లడించారు.