ఆర్కే 7 గనిని సందర్శించిన జడ్జీ
శ్రీరాంపూర్, (విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని ఆర్కే 7 భూగర్భ గనిని మంచిర్యాల జ్యూడీషియల్(Mancherial Judicial) ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, సీనియర్ సివిల్ జడ్జీ కే నిరోష మంగళ వారం సందర్శించారు. గని అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ లో పని ప్రదేశాలను పరిశీలించి, బొగ్గు ఉత్పత్తి తీరుతెన్నులు, అందుకు అనుగుణంగా వివిధ విభాగాల ఉద్యోగుల పనితీరు గమనించారు.
గని వివరాలు, ఉత్పత్తి, ఉద్యోగుల పని విధానం, రక్షణకు యాజమాన్యం చేపడుతున్న చర్యలను గని మేనేజర్ తిరుపతి వివరించారు. ఈ సందర్భంగా జడ్జీ నిరోష మాట్లాడుతూ దేశానికి వెలుగులు పంచేందుకు చీకటిలో సింగరేణి ఉద్యోగుల కష్టాన్ని ప్రత్యక్షంగా చూడటం ఒక ప్రత్యేక అనుభూతి అని అన్నారు.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చమటోడ్చుతున్న ఉద్యోగుల భద్రతకోసం సింగరేణి సంస్థ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ముఖ్యంగా సేఫ్టీ కోసం సింగరేణి యాజమాన్యం చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్ లో మరింత ముందుకు సాగాలని పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. జడ్జీ వెంట మేనేజర్ తిరుపతితో పాటు డిప్యూటీ మేనేజర్ వెంకట్రామ్, సీనియర్ పీఓ సంతన్ తదితరులున్నారు.