ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం జాగ్రత్తలు పాటించాలి

24-11-2026 | 07:37pm

జిల్లా కలెక్టర్​ సత్య శారద

వరంగల్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా(Indiramma Jeevitha Bima) పథకంలో జాగ్రత్తలను తప్పని సరిగా పాటించాలని వరంగల్​ జిల్లా కలెక్టర్​ డాక్టర్​ సత్య శారద (Collector Dr. Satya Sharada) అన్నారు. మంగళవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రతి కుటుంబానికి ఎంపిక చేసిన నామినీ వివరాలను పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ఈ నెల 19వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 18వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.

ప్రతి కుటుంబానికి బీమా పొందేందుకు ఎంపిక చేసిన వ్యక్తి వివరాలతో పాటు, వారి నామినీ పేరును తప్పనిసరిగా పథకం పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ బీమా పొందే వ్యక్తి వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలని, నమోదు సమయంలో లబ్ధిదారుల ఆధార్, కుటుంబ వివరాలు, నామినీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

నామినీలకు కేటాయించే వాటాల శాతం మొత్తం 100 శాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రయోజనం అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఎల్. కిషోర్ కుమార్, వై.వి. గణేష్, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, జెడ్పీ సీఈవో వసంత, డీపీవో కల్పన, సీపీవో చంద్రకళ, డీఆర్డీవో నాగపద్మజ, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు