సింగరేణిపై పట్టుకోసం పాకులాట..
- కేటీఆర్ పర్యటనపై చర్చ
- కాంగ్రెస్ మంత్రుల్లో కదలిక
- అధిపత్యం పోరు షురూ
- బొగ్గు సంఘంలో జోష్
- ప్రధాన పార్టీల మధ్య పోటీ
బెల్లంపల్లి, అక్టోబర్ 23: సింగరేణి(Singareni)లో పట్టుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు పాకులాడుతున్నాయి. పోటా పోటీగా ఆయా పార్టీల అధినేతలు పర్యటనలు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార, ప్రతి పక్షాల మధ్య కోల్ వార్ చర్చనీయాంశమైంది. ఇటీవల గోదావరిఖని కార్మిక గర్జన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది.
రానున్న సింగరేణి గుర్తింపు ఎన్నికలే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది. రాజకీయ ఆదిపత్యం కోసం పోటీపడుతున్నాయి. సింగరేణిలో జరుగుతోన్న అవినీతి అక్రమాలపై కేటిఆర్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి ప్రైవేటీకరణ చేయడం తధ్యమని కేటీఆర్ వ్యాఖ్యలు సింగరేణిలో చర్చనీయాంశం అయ్యాయి.. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించడం, సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేస్తామనడంలో నిజం లేదనీ ఖండించారు. కేటీఆర్ చేసిన అవినీతి వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా స్పందించారు.
సింగరేణి కేంద్రంగా కేటీఆర్ కార్మిక గర్జన సభ అధికార పార్టీ గుబులు రేపుతోందనీ విశ్లేషకులు అంటున్నారు. ప్రతి ఏటా కార్మికలకు చెల్లించే లాభాల వాటా విషయంలో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గత ఏడాదిలో ప్రకటించిన 34 శాతంనీకి మించకుండా ప్రకటించడం కార్మిక లోకాన్ని ఆగ్రహ వేషాలకు గురిచేసింది.14న తలపెట్టిన కేటీఆర్ కార్మిక గర్జన సభకు ఒకరోజు ముందు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లాభాల వాటాను ప్రకటించారు.
శత్రువుకి విమర్శనాస్త్రాలు అందించినట్టు అయ్యింది. లాభాల వాటాను రాజకీయంగా కేటీఆర్ వాడుకున్నారు. ఈ ప్రభుత్వ సరైనా లాభాల వాటాను ఇచ్చే పరిస్థితిలో లేదని, కార్మికులు సాధించిన లాభాల్లో తగిన వాటాను ఇవ్వలేక పోయిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కార్మికులను ఆకట్టుకున్నాయి. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు లాభాల వాటా సముచితంగా ఇచ్చామన్నారు. వాటాపై కేటీఆర్ చేసినా ప్రసంగం కార్మికుల్లో ఆలోచనలు రేకెత్తించింది. ఒక్కటీ మాత్రం నిజం లాభాల వాటా విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైందని చెప్పవచ్చు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేని స్థితిలో మంత్రులు ఆత్మరక్షణలో పడిపోయారు. సింగరేణిలో కేటిఆర్ పర్యటన ఫలప్రదంలో ప్రభుత్వ ప్రకటించిన లాభాల వాటానే పరోక్ష పాత్ర వహించిదని అభిప్రాయాలున్నాయి. ఒక్కో అంశంతో బీఆర్ఎస్ కార్మిక క్షేత్రంలోకి వస్తోందని సింగరేణి కార్మిక గర్జననే అందుకు సంకేతమని భావించాలి. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపునకు ఎదో మేరకు కేటీఆర్ సభ లాభిస్తుందని గులాబీ శ్రేణుల్లో ఆశాభావం వ్యక్తం అవుతున్నది. కేటీఆర్ సింగరేణి పర్యటన గులాబీ శ్రేణులు ఉరకలేస్తున్నారు.
ఈ నేపథ్యంలోని ప్రభుత్వం, ఐఎన్టీయూసీ కౌంటర్ పాలిటిక్స్ లో విఫలం అయ్యారనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా, దసరా పండుగ సందర్భంగా కార్మికులను ప్రభుత్వం సంతృప్తి పర్చిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులు ఎంతో కాలంగా ఎదురు చేస్తున్న మారుపేర్లు, కారుణ్య ఉద్యోగాలు, వంటి అంశాలు ఒకింత సింగరేణి కార్మికుల్లో సానుకూలత వ్యక్తం అయ్యింది. లాభాల వాటాను మెప్పించడం కోసమే వాటిని ప్రకటించినట్టు భావిస్తున్నారు. ఇందులో ప్లస్, మైనస్ రెండూ కనిపిస్తున్నాయి. మొత్తంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాజికల్ ప్రకటన సింగరేణిలో గందరగోళం రేపింది.
- సింగరేణి మనుగడపై స్పష్టత కరువు..
సింగరేణి విషయంలో ప్రభుత్వం స్పష్టమైనా విధానం అంటూ లేదన్న విమర్శలు సర్వత్రా చర్చగా మారాయి. బొగ్గు గనుల నిర్వహణ, సంస్థ, మనుగడ, కార్మికుల సంక్షేమంపై ఇప్పటికీ స్పష్టత కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. కష్టకాలంలో ఉన్న సింగరేణి కంపెనీనీ గట్టెక్కించేవి భూగర్భ గనులు అనే విషయాన్ని గుర్తించడం లేదన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి. వ్యయ భారాన్ని పక్కన పెట్టి బొగ్గు ఆధారిత ప్రాజెక్టు, ఉపాధి నిచ్చే రంగాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించకుండా పక్కదారి పడుతున్నదన్న అభిప్రాయాలు ఉన్నాయి. సింగరేణి సంస్థను నిలబెట్టే పరిస్థితి కనుచూపు మేరలో కూడా లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టి సింగరేణిలో పట్టు సాధించడం కోసం కేటీఆర్ పర్యటన ఫలప్రదం అయ్యిందనీ చెప్పొచ్చు.
- బొగ్గు సంఘంలో జోష్..
సింగరేణిలో కార్మిక గర్జన సభ టీబీజీకేఎస్ లో జోష్ నింపింది. చాలా రోజులకు సింగరేణిలో ఇంత పెద్ద సభ జరగడం ఇటీవల ఇదే మొదటిదని చెప్పవచ్చు. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల ముందు కేటీఆర్ పర్యటన టీబీజీకేఎస్ కు కార్మికుల్లో తమ ఆదరణను చాటుకున్నట్లు అయింది. సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. 2023లో సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఏఐటీయూసీకి ఆ సంఘం మద్దతు తెలిపింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం శ్రేణులు ఐఎన్ టీ యూసీనీ ఓడించడం కోసం ఏఐటీయూసీకి తెరవెనుక నుంచి మద్దతు తెలిపింది.. ఏఐటీయూసీ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.
తమ శక్తియుక్తులను కూడగట్టుకొని ఏఐటీయూసీ గెలుపును తమ భుజస్కంధాలపై వేసుకున్నది. సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపులో అత్యంత కీలకమైన పాత్ర టీబీజీకేఎస్ పోషించింది. అనుకున్నట్టు ఈ ఎన్నికల్లో 11 ఏరియాలో ఏఐటీయూసీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని గుర్తింపు హోదాను సొంతం చేసుకుంది. ఈ లెక్కన సింగరేణిలో బొగ్గు గని కార్మిక సంఘానికి గట్టిపట్టే ఉందనే విషయం ఆ ఎన్నికలతో స్పష్టం అయ్యింది. ఈ సారి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బలాన్ని పెంచుకొని ఒంటరిగానే రంగంలోకి దింపే యోచన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉన్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే సింగరేణిలో ఆయన పర్యటించారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేటీఆర్ పర్యటనతో సింగరేణిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారి పార్టీ కూడా సింగరేణిపై ప్రధాన దృష్టి సారించింది. ఇక ఇప్పటి నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. గులాబీ పార్టీనీ బలోపేతం దిశగానే కేటీఆర్ పర్యటనలు చేస్తున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కోల్బెల్ట్ లో పర్యటించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఎవరి స్థాయిలో వారు బీఆర్ఎస్ బలోపేతం కోసం పాకులాడుతున్నారు. ఇదిలా ఉండగా సింగరేణి లోఅందరికంటే ముందుగానే టీఆర్ఎస్ అధినేత్రి, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సింగరేణి బాయిబాట పేరిట ఆమె సింగరేణి పట్టు కోసం పర్యటన చేశారు.