అక్రమ అరెస్టులకు భయపడేది లేదు
మంత్రి పదవి ఇచ్చే వరకు పోరాటం ఆగదు: బాపు నాయక్
కోటపల్లి,(విజయక్రాంతి): బంజారా, లంబాడీ హక్కుల(Banjara and Lambadi rights) కోసం పోరాడుతున్న నాయకులపై ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి మండల యూత్ అధ్యక్షులు బాపు నాయక్ మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సిద్ధమైన ఆయనను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బాపు నాయక్ మాట్లాడుతూ.. బంజారాలకు మంత్రి పదవి ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా భయపడేది లేదని, లంబాడీ జాతి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు.
తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు అర్హత ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కులగణనలో ఎస్టీ లంబాడీల జనాభా వివరాలను బహిర్గతం చేయాలని, ఎస్టీలు సాగు చేస్తున్న భూములకు శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి.. వాటి అమలుపై ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులతో అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని బాపు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. లంబాడీ జాతి హక్కుల కోసం భవిష్యత్తులో చేపట్టే ప్రతి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని బాపు నాయక్ హెచ్చరించారు.