పెండింగ్ కేసులపై సీపీ ఆరా!
మందమర్రి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా గురువారం మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌తో కలిసి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కేంద్రం, రికార్డులు, సీసీటీఎన్ఎస్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలు, పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్‌పై ఎస్ఐ నరేష్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు 5ఎస్ విధానాన్ని (5S SYSTEM) సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు.
సింగరేణి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి మందమర్రిలో ప్రత్యేక సవాళ్లు ఉంటాయన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో దొంగతనాల నియంత్రణ **(CRIME CONTROL)**పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టి మందమర్రిని నేర రహిత, మాదకద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు.ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పోలీస్ సిబ్బంది (POLICE STAFF) అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కమిషనర్ సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు (PUBLIC SERVICES) అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.