సింగరేణి పాఠశాలలో పౌష్టిక అల్పాహారం

08-10-2026 | 06:56pm

మందమర్రి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి హైస్కూల్‌లో తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) చేపట్టిన పౌష్టిక అల్పాహార కార్యక్రమాన్ని ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ గురువారం ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత కోసం ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమన్నారు.

సెంట్రల్ మోడర్న్ కిచెన్ నుంచి నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో 8 మోడర్న్ కిచెన్లకు రూ. 50 కోట్లు, మంచిర్యాల జిల్లా మోడర్న్ కిచెన్‌కు రూ.7.5 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం సిద్ధమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) సిహెచ్. అశోక్, హెచ్‌ఎం జె. పురుషోత్తం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు