అడుగడుగునా గుంతలు...
- నరకప్రాయంగా తండా రోడ్డు...
- పట్టించుకోని అధికారులు....
తాడ్వాయి,అక్టోబర్, 08( విజయ క్రాంతి ): గ్రామాలలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. అడుగడుగున గుంతలు నరకప్రాయంగా ప్రయాణం.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పిర్మాయకుంట తండా (Piramayakunta Thanda )రోడ్డు అద్వానంగా మారింది.
నందివాడ నుంచి తండా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామం నుంచి తండా వరకు వెళ్లాలంటే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు అధికారులకు రోడ్డు పరిస్థితి పై చెప్పామని అయినా అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
శిథిల దశలో బీటీ రోడ్డు...
గత పది సంవత్సరాల క్రితం వేసిన బీటీ రోడ్డు శిథిల దశకు చేరుకుంది.నందివాడ నుంచి తండా వరకు అడుగడుగునా రోడ్డుకు గుంతలు ఏర్పడ్డాయి.దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే ప్రజలు అవస్థలు పడుతున్నారు.ఏ చిన్న అవసరం ఉన్న తండావాసులు నందివాడ గ్రామానికి రావాల్సిందే.దీంతో తీవ్ర ఇక్కట్లు ఏర్పడుతున్నాయి.
వెంటనే రోడ్డు నిర్మించాలి...
పిరుమాయకుంట తండా రోడ్డు అధ్వానంగా ఉండడంతో ప్రయాణం ఇబ్బందిగా మారిందని తండావాసులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలి.బీటీ రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ఈ గుంతలను మొరంతో పూడ్చారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.