పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
మందమర్రి, (విజయక్రాంతి) : సింగరేణి సంస్థలో నిర్వహిస్తున్న ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమంలో(Cleanliness Program) భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే-2 బంగ్లా ప్రాంగణంలో మంగళవారం శ్రమదానం, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని, స్వయంగా చీపురు పట్టి చెత్తాచెదారం తొలగించి అధికారులకు, ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు.
పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఎండిన ఆకులను తొలగించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, వ్యర్థాలను సక్రమంగా పారవేయాలని, ఈ-వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో తొలగించాలని సూచించారు.
మందమర్రి ఏరియాలోని గనులు, కార్యాలయాలు, విభాగాలు, నివాస ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అక్టోబర్ 31లోగా పరిశుభ్రత పనులు, పాత రికార్డుల తొలగింపు, స్క్రాప్ పారవేత పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ (ఈ అండ్ ఎం) బాలాజీ భగవతి, డీజీఎం కిరణ్ కుమార్, ఏఎస్ఓ మురళి, పర్యావరణ అధికారి వెంకట్ రెడ్డి, ఫారెస్ట్ అధికారి నవీన్, డీజీఎం (సివిల్) మదీనా భాష, పర్చేస్ అధికారి బాబు, ఐటీ డీవై మేనేజర్ రవి, సీనియర్ పీఓ సురేందర్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.