ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు చేపట్టాలి

22-10-2026 | 07:47pm
  1. ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ కొరడా
  2. జిల్లా వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీలు

పాపన్నపేట,అక్టోబర్22: ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించకపోతే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తప్పవని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి కె. దేవ్ కుమార్(Agricultural Officer K. Dev Kumar) హెచ్చరించారు. గురువారంమండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రిజిస్టర్లు, గోదాముల్లోని ఎరువుల నిల్వలను పరిశీలించారు.

ఈ సందర్భంగా డీలర్లకు పలు సూచనలు చేశారు. ఎరువుల విక్రయాలను తప్పనిసరిగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారానే నిర్వహించాలని, దుకాణాలకు సంబంధించిన రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయాల వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు. వరి విత్తనాల విక్రయాలను సాధ్యమైనంత వరకు చేపట్టరాదని తెలిపారు.

వ్యవసాయ శాఖ నిబంధనలను ప్రతి డీలర్ తప్పనిసరిగా పాటించాలని, ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా సంబంధిత లైసెన్స్ డీలర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాస రాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఆసిఫ్, సంతోష్ కుమార్‌తో పాటు ఎరువుల డీలర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు