సరదా కోసం వెళ్లి మృత్యు ఒడికి..
* ప్రాణం తీసిన సరదా..
* మంజీరా చెక్‌డ్యాంలో నీట మునిగి ఇద్దరు మృతి
* గ్రామాల్లో విషాదఛాయలు
పాపన్నపేట,అక్టోబర్23: మంజీరా నదిలో(Manjira River) స్నానానికి వెళ్లిన ఇద్దరు నీట మునిగి మృత్యువాత పడిన విషాద ఘటన శుక్రవారం పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చన్‌పల్లి మంజీరా చెక్‌డ్యామ్(Podchanpalli Manjira Check Dam) వద్ద చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లిన వారు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. చికోడ్ గ్రామానికి చెందిన మంజుల (35) గురువారం తన అక్క స్వప్న వద్దకు వచ్చారు.
శుక్రవారం కుటుంబ సభ్యులంతా కలిసి స్వప్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అనంతరం సమీపంలోని పొడ్చన్‌పల్లి మంజీరా చెక్‌డ్యామ్(Podchanpalli Manjira Check Dam) వద్దకు చేరుకుని స్నానం చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్వప్న కుమార్తె కంబాల ప్రీతి (14), మంజుల సహా ముగ్గురు పిల్లలు నీటిలో మునిగిపోతుండగా కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే చీరల సహాయంతో ముగ్గురు పిల్లలను రక్షించారు. అయితే మంజుల, ప్రీతి నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు.
దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ పంచనామా నిర్వహించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు మృతి చెందడంతో బాధిత కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.