శోకసంద్రంలో టాలీవుడ్

24-09-2026 | 09:08am

సీనియర్ దర్శకుడు ఎస్ఎస్ రవిచంద్ర కన్నుమూత

హైదరాబాద్: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్ఎస్ రవిచంద్ర(Director SS Ravichandra) (84) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కృష్ణ, బాలకృష్ణ, వెంకటేశ్‌తో సినిమాలు

ఎస్ఎస్ రవిచంద్ర తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అగ్ర కథానాయకులతో పలు చిత్రాలను తెరకెక్కించారు. సూపర్‌స్టార్ కృష్ణ(Superstar Krishna) నటించిన ‘రౌడీ నంబర్ వన్’, ‘కిరాయి గుండా’, ‘సార్వభౌముడు’, ‘దొరగారికి దొంగపెళ్లాం’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన ‘దేశోద్ధారకుడు’, ‘అశోక చక్రవర్తి’ సినిమాలకు కూడా రవిచంద్ర దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh) నటించిన ‘అగ్గిరాముడు’, ‘విజేత విక్రమ్’ చిత్రాలను సైతం ఆయన తెరకెక్కించారు.

రవిచంద్ర స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు. సినీ రంగంలో దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అప్పటి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాయి. రవిచంద్ర మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, సినీ వర్గాలకు చెందిన పలువురు ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు