మా సినిమా చూస్తే ఇక ఇడుపు కాయితం గురించి ఆలోచించరు!
బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా ‘ఇడుపు కాయితం(Idupu Kayitham)’. ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్గా నటిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఎంటర్టైనింగ్ డ్రామాగా ఈ సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఇందులో శివజ్యోతి, సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 11న థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ‘గడప..’ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “ఇడుపు కాయితం’ సినిమా ప్రారంభమైనప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్‌గా చాలా మంది స్పందించారు. ఆ టైమ్‌లో మేము తప్పు చేస్తున్నామా అనిపించిది. కానీ, మీడియా, ఇండస్ట్రీ నుంచి మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ ముందుకొచ్చారు. వారి సపోర్ట్ తో నెగిటివ్‌ను పాజిటివ్ చేసుకోవచ్చు అనే నమ్మకం కలిగింది.
ఆ నమ్మకంతోనే ఈరోజు అందరినీ మా గడపలోకి ఆహ్వానిస్తున్నాం. మా అమ్మ తన ఇంటి గడప దాటి మా ఇంటికి వచ్చింది, అలాగే నా సోదరి, నా భార్య.. ఇలా మన ఇంటిలో గడప గురించి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి గడపను సెలబ్రేట్ చేసే పాట ఉంది. నేటివిటీ గురించి ఆలోచించినా మావైపు ఒకసారి చూడండి. ఈ పాట వినండి. మీ ఆ ప్రేమను ఫీల్ అవుతారు. డిసెంబర్ 11న మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఏ ప్రాంతమైనా భాషైనా మీకు మా సినిమా నచ్చుతుంది. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది” అన్నారు.
హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ.. “ఇడుపు కాయితం’ సినిమాకు వర్క్ చేస్తున్న క్రమంలో ఇది నాకొక ముఖ్యమైన రోజు అనుకుంటున్నా. గడప సాంగ్ అందరికీ కనెక్ట్ అయ్యిందని నమ్ముతున్నా. ఇంట్లో ఏ పనిచేసినా అమ్మ నీకు పెళ్లయి అత్తవారింటికి వెళ్తే తెలుస్తుందనేది.. ఆ మాట ఈ సినిమాలో శ్రీలత పాత్రలో నటిస్తున్నప్పుడు గుర్తొచ్చేది. గడప సాంగ్ ప్రోమో రిలీజ్ కాగానే మా నాన్న ఫోన్ చేసి బాగా నటించావు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. నాగదుర్గ నుంచి శ్రీలతగా మారేందుకు చాలా కష్టపడ్డా. ఆ కష్టాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా.
శ్రీలత అంటే మా ఇంటి అమ్మాయి మీ ఇంటి అమ్మాయి అందరి ఇళ్లలో ఉండే అమ్మాయి. ప్రాంతీయ భేదం లేకుండా నా పాత్రను అంతా ఇష్టపడతారు” అని చెప్పింది. నిర్మాత బన్నీవాస్ మాట్లాడుతూ.. “దర్శకుడు ఈ కథ చెబుతున్నప్పుడు తెలంగాణ నేపథ్యం అనేది గుర్తుకురాలేదు. నాకు నా చిన్నప్పుడు చూసిన ఊరి, ఇంటి వాతావరణం కళ్లకు కట్టినట్లు కనిపించింది. మన ఇంటి కథ చెప్పినట్లు అనిపించింది. కథ విన్న వింటనే ఇది సినిమా కథలా లేదు మన ఇంట్లో జరిగే కథలా ఉంది అని చెప్పా. ఈ సినిమా కథ, మాటలు, నేపథ్యంలోని సహజత్వమే మా అందరినీ ఆకట్టుకుంది.
సుకుమార్, తబిత సపోర్ట్‌తో నా కెరీర్లోనే వేగంగా నిర్మించిన సినిమా ఇది. కొత్తగా పెళ్లయ్యే ఏ అమ్మాయినైనా గడప సాంగ్‌లోని లిరిక్స్ బాగా ఆకట్టుకుంటాయి. కొత్త జంటలు.. అత్తా మామను తీసుకుని మా సినిమా చూసేందుకు రండి. థియేటర్ నుంచి బయటకు వెళ్లేప్పుడు వాళ్లు మీ భుజాలపై చేయి వేసి తీసుకెళ్తారు. మీ పెళ్లయిన కొత్తలో మా సినిమా చూస్తే మీరు ఇంకెప్పుడు ‘ఇడుపు కాయితం’ గురించి ఆలోచించరు. అన్నారు. డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి మాట్లాడుతూ.. “ఈ వేదిక మీద తెలంగాణ కళాకారులందరినీ చూస్తుంటే భావోద్వేగానికి గురవుతున్నా.
మా అందరిలో సహజంగానే తెలియని ఉద్వేగం ఉంటుంది. మా కళాకారులను ఈ వేదిక మీద చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మా మూవీ టైటిల్ గురించి కూడా చాలా వివాదాలు వచ్చాయి. అయినా ఏ రోజూ మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా కోసం ఎవరినీ తీసుకున్నా నన్ను ప్రశ్నించలేదు” అని తెలిపారు. చిత్ర సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి మాట్లాడుతూ.. “ఇడుపు కాయితం’ అనే గొప్ప సినిమాకు వర్క్ చేసే అవకాశం కల్పించిన మా దర్శక నిర్మాతలకు థ్యాంక్స్.
శ్రీలత సాంగ్‌కు అలరాజు ఎంత మంచి లిరిక్స్ అందించారో ఈ గడప పాటకు అభినయ శ్రీనివాస్ అంతే మంచి లిరిక్స్ అందించారు. మా విజయ అక్క బాగా పాడారు. ఈ సినిమా సాంగ్స్, మ్యూజిక్ మీకు ఒక స్పెషల్ మెమొరీగా గుర్తుండిపోతాయి” అని చెప్పారు. గీత రచయితలు అలరాజు, అభినయ శ్రీనివాస్, గాయకులు తేలు విజయ, శంకర్‌బాబు, నటీనటులు మైమ్ మధు, వినోద్ బాల, అభినవ్ గోమటం తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు.