అవును.. నా యాస ఇలాగే ఉంటుంది!
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తాను ఏదో ఒక అంశంపై నిరంతరం ట్రోలింగ్‌ను ఎదుర్కొంటూనే ఉన్నానని నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హిందీ సినిమాల్లో ఆమె మాట్లాడుతున్న దక్షిణాది యాసను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు చేస్తున్న హేళనపై ఆమె తాజాగా ధీటుగా స్పందించారు.
తన యాసపై వస్తున్న విమర్శల గురించి టాక్ షోలో కరణ్ జోహార్ ప్రశ్నించగా, రష్మిక ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు. ‘నేను దక్షిణాది నుంచి వచ్చిన అమ్మాయిని, కాబట్టి సహజంగానే నా మాటల్లో ఆ యాస ఉంటుంది. అలా కాకుండా నేను వేరేలా మాట్లాడాలని అనుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. నా సహజమైన యాసను తప్పుగా చూడాల్సిన అవసరం లేదు’ అని స్పష్టంచేశారు. సినీ ప్రయాణం ప్రారంభమైన నాటి నుంచి తన నటన, భాష, ఉచ్చారణ లేదా వ్యక్తిత్వం.. ఇలా ఏదో ఒక విషయంలో విమర్శలు వస్తూనే ఉన్నాయని రష్మిక పేర్కొన్నారు.
అయితే, ఈ నెగెటివిటీ ఏనాడూ తన కెరీర్ ఎంపికలను ప్రభావితం చేయలేదని చెప్పారు. ‘ఈ విమర్శల వల్ల నా పరిధులు మార్చుకోవాలని కానీ, విభిన్న భాషా చిత్రాలలో నటించకుండా ఆగిపోవాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు అన్ని పరిశ్రమల్లోనూ పనిచేయాలని, అన్ని భాషలూ మాట్లాడాలని ఉంది’ అని తన ఆత్మవిశ్వాసాన్ని చాటారు. ఇతరులను మెప్పించడం కోసం తాను ముసుగు వేసుకోలేనని, తనలా తాను సానుకూలంగా ఉంటడానికే ప్రాధాన్యం ఇస్తానని రష్మిక ముగించారు.