గోరటి వెంకన్నతో పాట అందుకే రాయించా..!

08-09-2026 | 05:40am

ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్’. 90’స్ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయా లను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ ఆదిత్య హాసన్(Aditya Hasan), పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

* నా అసలు పేరు ఆదిత్య. నేను కమల్ హాసన్(Kamal Haasan) వీరాభిమానిని. ఆ అభిమానంతోనే నా పేరును ఆదిత్య హాసన్‌గా మార్చుకున్నా. మాది వనపర్తి(Wanaparthy). మా నాన్న రిటైర్డ్ స్కూల్ టీచర్. టెన్త్ తర్వాత నాకు సినిమాపై ఆసక్తి పెరిగింది. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌(Assistant Director)గా పనిచేయలేదు. హైదరాబాద్‌(Hyderabad)లో డిగ్రీ చదివి, మాస్టర్స్ కోసం యూకే వెళ్లా. అప్పటికే షార్ట్ ఫిలిమ్స్(Short Films) చేసిన నేను, యూకే నుంచి తిరిగి వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టా. కలర్స్ స్వాతితో ‘టీచర్’ అనే సినిమా నవీన్ మేడారం, అభిషేక్ నామాతో నిర్మించా. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.   

* ‘ఎపిక్’ సినిమా నా బయోపిక్ అంటున్నారు. కానీ, నా జీవితం అంత అందంగా లేదు (నవ్వుతూ). -నిజ జీవిత సంఘటనల స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాం. ‘90స్’ సిరీస్‌లో కూడా మా ఊరిపేరు, మా కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి. కానీ, అందులోని ప్రతి సంఘటన మా జీవితంలో జరిగినట్లు కాదు. వివిధ జీవితాల్లోని సంఘటనలే కథగా రాసుకున్నా. 

* ‘ఎపిక్’ గొప్ప కథ అని చెప్పను. ఒక యువకుడు హైదరాబాద్ నుంచి యూకే వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది కథ. ‘90స్’ ఎలాగైతే సహజంగా ఉంటుందో, ‘ఎపిక్’ కూడా అంతే. కొన్ని సంఘటనలు గుర్తుండిపోతాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల గురించి, అక్కడి బంధాల గురించి ఎక్కువగా సినిమాలు రాలేదు. పైగా, నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అది కొత్తగా ఉంటుందనిపించి, ఈ కథ ప్రేక్షకులకు చెప్పాలనుకున్నా. నాకు అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. ఎవరినీ కించపరచకుం డా, ఎలాంటి ఎజెండాలు లేని విలువలతో కూడిన సినిమా చేయడమే నా లక్ష్యం. * 

* ‘ఎపిక్’ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ‘90స్’ సిరీస్‌కు ఇది సీక్వెల్. అందులోని తమ్ముడి పాత్రకు సంబంధించిన జీవితంలోని ఒక భాగం ఎపిక్ కథగా ఉంటుంది. ఆ తర్వాత అన్న జీవితాన్ని ఒక కథగా, అక్క జీవితాన్ని ఒక కథగా చూపించే ఆలోచన ఉంది.

* ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’కు కొనసాగింపు ఉంటుంది. ‘ఎపిక్- ఫైనల్ సెమిస్టర్’ పేరుతో ఆ కథ కొనసాగుతుంది. మొదటి భాగంలో ముగింపు కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల కోణంలోనో, దర్శకుడి కోణంలోనో కాకుండా ఆ కథకు ఎలాంటి ముగింపు అవసరమో, అలాంటి క్లైమాక్స్ రాశా. 

* నాకు చిన్నప్పటి నుంచి గోరటి వెంకన్న అంటే అభిమానం. నేను లండన్‌లో చదువుకునే రోజుల్లో కూడా ఆయన పాటలే వింటూ ఉండేవాడిని. నా మొదటి సినిమాలో ఖచ్చితంగా ఆయన పాట ఉండాలనుకునేవాడిని. అందుకే ‘ఎపిక్’లో ఆయనతో ‘సంచారమే’ రాయించి, పాడించి.. ఆ పాటతోనే ప్రమోషన్స్ మొదలుపెట్టాం. 

మరిన్ని వార్తలు