పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి

16-09-2026 | 06:40pm

వెంకటాపూర్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మండల పరిధిలోని పెద్దాపూర్, లక్ష్మీదేవిపేట, జవహర్‌ నగర్ ఉప కేంద్రాలను ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి, జిల్లా మాతా సంరక్షణ ప్రోగ్రామ్ అధికారి డా. చీర్ల శ్రీకాంత్(Maternal Care Program Officer Dr. Chirla Srikanth), జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రామ్ అధికారి డా. రంజిత్‌ తో కలిసి ఆయా కేంద్రాల్లో ఆరోగ్య కార్యక్రమాల అమలు, రికార్డులు, నివేదికలను పరిశీలించారు.

పెద్దాపూర్ ఉప కేంద్రంలో ఆరోగ్య, ఆశా కార్యకర్తల పనితీరును సమీక్షించిన అధికారులు అనంతరం స్థానిక పాఠశాలను సందర్శించారు. 9, 10వ తరగతి బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. వ్యాక్సిన్‌పై తల్లిదండ్రులకు కూడా సరైన అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) స్క్రీనింగ్ నిర్వహించాలని, ఈ నెలాఖరులోగా 100 శాతం పూర్తి చేయాలని డా. రంజిత్ ఆదేశించారు.

సీజనల్, కీటక జనిత వ్యాధుల నివారణలో భాగంగా గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని, నీటి నిల్వలు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి శ్రీనివాస్, ఉప కేంద్ర ఆరోగ్య కార్యకర్త నిరోష, ఉపాధ్యాయులు సంతోష్ రెడ్డి, కవిత, ఉపకేంద్ర ఎం ఎల్ హెచ్ పి నవీన్, ఆరోగ్య కార్యకర్త వజ్రమ్మ, పల్లె దావఖాన వైద్యాధికారి డా. సంఘమిత్ర, ఆరోగ్య కార్యకర్త స్వర్ణలత, ఆశాలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు