ఆహార భద్రతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట
ములుగు, ఆగస్టు 15 (విజయక్రాంతి): పేదల ఆకలి తీర్చుటకు, ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఆహార భద్రత కార్డులు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పేద కుటుంబాలు కూడా నాణ్యమైన సన్న బియ్యంతో రెండు పూటలా కడుపునిండా భోజనం చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
15-08-2026