లంబాడి సంప్రదాయాలకు ప్రతీక.. తీజ్ పండుగ

22-10-2026 | 07:27pm

వెంకటాపూర్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామపంచాయతీ(Lakshmidevipeta Grama Panchayat) పరిధిలో గల లంబాడి తండాలో గురువారం గిరిజనుల సంప్రదాయ పండుగ తీజ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తండాలో పండుగ సందడి నెలకొంది. గిరిజన మహిళలు, యువతులు సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు అజ్మీర హరీష్, రజిత మాట్లాడుతూ.. తీజ్ పండుగ లంబాడి గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఈ పండుగలో భాగంగా గోధుమలను బుట్టల్లో వేసి తొమ్మిది రోజులపాటు పెంచుతారని, ప్రతిరోజూ సాయంత్రం బుట్టల వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ నృత్యాలు చేస్తారని వివరించారు.

తొమ్మిదో రోజు పండుగ ముగింపు సందర్భంగా మొలకెత్తిన గోధుమల్లో కొన్నింటిని గిరిజన పెద్దల తలపాగాల్లో ఉంచి గౌరవిస్తారని, మిగిలిన మొలకలను సమీపంలోని చెరువులో నిమజ్జనం చేస్తారని తెలిపారు. అనంతరం తీజ్ బుట్టలను తీసుకొచ్చిన యువతుల కాళ్లను వారి సోదరులు కడిగి ఆశీస్సులు తీసుకోవడం ఈ పండుగలో ప్రత్యేక ఆచారమని పేర్కొన్నారు.

ఇలాంటి పండుగల ద్వారా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందుతాయని అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు స్వామిలాల్, దేవేందర్, సమ్మయ్య, పర్తి, తిరుపతి, సీతారాం, సురేష్, బాల్య నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు