హలో మాదిగ - చలో అమరావతి
అక్టోబర్ 7న సిద్ధం కావాలి
వెంకటాపురంలో ఎమ్మార్పీఎస్ కరపత్రాల విడుదల
వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): పద్మశ్రీ డా. మంద కృష్ణ మాదిగ(Padma Shri Dr. Manda Krishna Madiga) ఆదేశాల మేరకు, ములుగు జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి చేతల రమేష్ మాదిగ పిలుపు మేరకు రాబోయే అక్టోబర్ 7న అమరావతిలో తలపెట్టిన "హలో మాదిగ - చలో అమరావతి" మహాసభను విజయవంతం చేయడానికి ములుగు జిల్లా మాదిగలు సిద్ధం కావాలని పిలుపునిస్తూ సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు యాసం రమేష్ మాదిగ అధ్యక్షతన చలో అమరావతి కరపత్రాలను ఘనంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ చేస్తున్న సైద్ధాంతిక పోరాటం నూతన సమాజ నిర్మాణం కోసమేనని, మన మహనీయులు బాబా సాహెబ్ అంబేద్కర్ కలలుగన్న సమానత్వ సమాజం, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరుగుతున్న ఈ చారిత్రాత్మక పోరాటంలో ప్రతి మాదిగ బిడ్డ కదం తొక్కాలని, అమరావతి సభతో దేశానికి మాదిగల ఐక్యత, చైతన్యం ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు.రానున్న రోజుల్లో మండలంలోని ప్రతి గ్రామంలో కరపత్రాలు పంచి, గోడలపై రాతలు రాసి, వాహనాల ద్వారా ప్రచారం చేసి వేలాదిగా అమరావతికి తరలివెళ్తామని తెలిపారు.