నిజామాబాద్‌లో రెండు బ్రిడ్జిలకు నిధులు!
బోధన్, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy)తో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(MLC Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ముఖ్యంగా మాదావనగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్‌బ్రిడ్జి నిర్మాణాలకు అవసరమైన నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని నాయకులు వివరించారు. వారి విజ్ఞప్తులపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి, రెండు బ్రిడ్జిల నిర్మాణానికి నిధుల మంజూరుకు అంగీకరించినట్లు నేతలు వెల్లడించారు. ఈ నిర్మాణాలు పూర్తయితే నిజామాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి, రాకపోకలు సులభతరం కానున్నాయి. జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరిగితే నిర్మాణ పనులు ముందుకు సాగేందుకు మార్గం సుగమం కానుంది.
ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.