డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో రసాభాస.

01-10-2026 | 02:32pm
  1. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల వాగ్వాదం
  2. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్‌కు తరలింపు

నాగర్‌ కర్నూల్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది. కార్యక్రమంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, చారిలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు కౌన్సిలర్లను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కాగా, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మొత్తం 192 ఇళ్లకు గాను 181 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి, లక్కీడిప్ పద్ధతిలో ఆయా బ్లాక్‌లలోని ఇళ్లను కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కూడు, గూడు, గుడ్డ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని దామోదర్‌రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రావడంలో జాప్యం కారణంగా ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందన్నారు.

ఇళ్ల కేటాయింపులో ఎలాంటి మధ్యవర్తిత్వం, సిఫారసులకు తావులేదని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇళ్ల వద్ద ఉన్న మౌలిక వసతులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లబ్ధిదారులతో సొసైటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేటాయించిన ఇళ్లను అద్దెకు ఇచ్చినా, విక్రయించినా, ఖాళీగా ఉంచినా పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరించారు.

లబ్ధిదారులు శుచిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని ఆర్డీఓ అర్చన సూచించారు. మిగిలిన పనులు పూర్తి చేసి అన్ని వసతులు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం నరేందర్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు