పాలమూరు నీళ్ల రగడ!

24-10-2026 | 05:35am
  1. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
  2. ఎల్‌నినో ప్రభావంతో గందరగోళంలో రైతాంగం
  3. సవాళ్లు.. ప్రతి సవాళ్లకే పరిమితమైన నేతలు
  4. ప్రాజెక్టు నిర్మాణంలో దొందూ దొందే.!
  5. పంట నష్ట పరిహారంపై మౌనం 

నాగర్ కర్నూల్ అక్టోబర్ 23 (విజయక్రాంతి): కరువు పీడిత ప్రాంతంగా పేరొందిన పాలమూరు ప్రజల సాగునీటి కలను సాకారమయ్యేందుకు జీవనాధారంగా ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Rangareddy Lift Irrigation Project).. ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రాజెక్టును ఎవరు నిర్లక్ష్యం చేశారనే అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పరస్పరం ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో హంగామా చేయడం తప్పితే క్షేత్రస్థాయిలో మాత్రం రైతాంగం ఎదుర్కొంటు న్న సాగునీటి కష్టాలు, ఎల్నినో ప్రభావం ఆందోళనలు, పంట నష్ట పరిహారం, కూలీల కొరత, విద్యుత్ సమస్యలపై మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. రైతాంగం నీళ్ల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో నీళ్ల పేరుతో నేతలు మాత్రం రాజకీయ డ్రామా చేస్తున్నారన్న అసంతృప్తి తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతోంది.

ప్రాజెక్టు నిర్మాణంలో దొందూ దొందే.!

పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని గొప్పగా ప్రకటించిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు పాలించినా పనులు పూర్తి చేయలేకపోయిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కానీ తమ హయాంలోనే 90 శాతం పనులు పూర్తి చేసి ఒక మోటార్ ఆన్ చేసి జాతికి అంకితం చేశామని బిఆర్‌ఎస్ పార్టీ చెప్పుకుంటోంది. మిగిలిన పనులను చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఫలితంగానే ఈ ప్రాంతంలో మళ్ళీ కరువు వచ్చి పడిందంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు విమర్శిస్తున్నారు. 

మోటార్ల చుట్టూ రాజకీయ మంటలు.

నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద మోటార్లు నడిపి శ్రీశైలం బ్యాక్వాటర్ను ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం వినియోగించుకోవడం లేదని మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ విమర్శించారు. దీనిపై మంత్రి జూపల్లి స్పందిస్తూ నార్లాపూర్‌ఏదుల మధ్య ప్రధాన కాలువ పనులు పూర్తి కాక పోవడంతోనే నీటిని తరలించడంలో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పనులు అప్పగిస్తే నీటిని ఏదుల వరకు పారించి చూపించాలని బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. దీనికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ పనులు అప్పగించేలా జీవో జారీ చేస్తే నీటిని తరలించి చూపిస్తామని ప్రతి సవాల్ చేశారు.

ఈ క్రమంలో నార్లాపూర్ వద్ద మోటార్లు నడిపి రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసేలా మంత్రి జూపల్లి కృష్ణారావు చర్యలు తీసుకున్నారు. అనంతరం ఎల్లూరు రిజర్వాయర్కు నీటిని తరలించే ప్రయత్నం జరిగింది. అయితే ఈ పరిణామాలే ఇప్పుడు రాజకీయ ప్రచారానికి ఆయుధాలుగా మారుతున్న పరిస్థితి. ఒకవైపు మోటార్లు నడిపించామని అధికార పక్షం చెప్పుకుంటుంటే, మరోవైపు మిగిలిన పనులు పూర్తి చేయకపోవడమే అసలు వైఫల్యమని ప్రతిపక్షం విమర్శిస్తోంది. కానీ రైతులకు ఎంతమేర ప్రయోజనం కలిగింది. మిగిలిన పనులు ఎప్పటికి పూర్తవుతాయి పూర్తి స్థాయి సాగునీరు ఎప్పుడందుతుందనే అంశం ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతుంది.

ఎల్‌నినో ప్రభావంతో తల్లడిల్లుతున్న రైతాంగం

ఒకవైపు పాలమూరు నీళ్లపై రాజకీయ రగడ కొనసాగుతుండగా మరోవైపు ఎల్నినో ప్రభావంపై రైతాంగంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ పరిస్థితులు, సాగునీటి లభ్యత, విద్యుత్ సమస్యలు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ ఏడది జిల్లాలో 6.45 లక్షల మేర పంట సాగు చేయాల్సి ఉండగా ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో అధికారులు 5.54 లక్షల అంచనాకు కుదించారు. రైతులు మాత్రం 4.98 లక్షల వరకు సాగు చేయగా ఎల్నినో మరింత ప్రభావం చూపింది.

ఫలితంగా 1.33లక్షల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. నష్టపోయే పరిస్థితులు ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకునేందుకు ముందస్తు కార్యాచరణ రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందనే రైతులు కోరుతున్నారు.కానీ నేతల ప్రసంగాల్లో ప్రాజెక్టులపై విమర్శలకు దొరికిన ప్రాధాన్యం రైతుల సమస్యలకు దక్కడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎల్నినో ప్రభావం గురించి చర్చలు జరపడం, సమావేశాలు నిర్వహించడం మాత్రమే సరిపోదు. రైతులకు వాస్తవంగా ఎలాంటి నష్టం వాటిల్లుతోంది పంటలు దెబ్బతింటే పరిహారం ఎలా అందిస్తారు సాగునీరు, విద్యుత్ సమస్యలను ఎలా అధిగమిస్తారనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ అవసరముందనే వాదన వినిపిస్తుంది. రైతు పొలంలో పంట ఎండిపోతుంటే రాజకీయ వేదికలపై మాటల పంట పండించడం వల్ల ప్రయోజనమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు