ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

27-10-2026 | 07:25pm

విద్యార్థులకు దుస్తులు, బూట్ల పంపిణీ.

చిట్యాల, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను(Government schools) ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్, చిట్యాల మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం తెలిపారు. మంగళవారం  పెద్దకాపర్తి గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన దుస్తులు, బూట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, దుస్తులు, బూట్లు అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, వార్డు సభ్యులు కురు యాదయ్య, ఆనగంటి నరేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు