4 September, 2026 | 10:55 PM

Breaking News

మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి

04-09-2026 | 10:35pm

మద్దూర్,(విజయక్రాంతి): నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం(Kodangal Constituency)లోని మద్దూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్  ప్రియాంక(Collector Priyanka) హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కళాశాల భవన నిర్మాణ నమూనా చిత్రపటాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి, భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం, నిర్మాణ విస్తీర్ణం, తరగతి గదులు, ప్రయోగశాలలు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 4 ఎకరాల స్థలంలోని  13,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఈడబ్ల్యూఐడీసీ ఎం.డీ. గణపతిరెడ్డి(EWIDC MD Ganapathi Reddy) ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం భవనం లోపల జరుగుతున్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు.

కళాశాల భవనం పక్కన ప్రధాన రహదారి వైపు ఉన్న అదనపు భూమిని సర్వే చేయించాలని, అది పట్టా భూమి అయితే కొనుగోలు చేసి కళాశాలకు విశాలమైన ప్రాంగణం, ప్రహరీ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంకకు ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే మార్చి నెలలోపు కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మద్దూరు ప్రాంతంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

 గురుకుల బాలికల పాఠశాల నిర్మాణ పనుల పరిశీలన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి  ఏ. రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో చింతల్ దిన్నే వైపు కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాల నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పనుల్లో జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ ప్రతి పడవద్దని సూచించారు. పనులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అయితే గురుకుల పాఠశాల నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాతలకు  ఇందిరమ్మ  ఇండ్లు   మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి మద్దూరుకు చేరుకున్న సందర్భంగా పట్టణంలో అభిమానులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.