30 ఏళ్లైనా మీకు అధికారం దక్కదు
- మీరు విదేశాల్లో ఉన్నారుగా.. నా మాటలు వినిపించవులే
- రాహుల్‌గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సెటైర్
- నిరసనలు, ప్రదర్శనల వల్ల ఏమీ సాధించలేరు
- ఓట్ల దొంగతనం ఆరోపణలపై కాంగ్రెస్‌పై ఎదురుదాడి
- పంజాబ్‌లో తదుపరి ప్రభుత్వం ఎన్డీఏదేనని అమిత్‌షా స్పష్టం
- యమునా నది ప్రక్షాళనకు రూ.8,941 కోట్లతో ప్రాజెక్టుల ప్రారంభం
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: సర్‌లో అవకతవకలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. ఈ తరుణంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) విదేశీ పర్యటనలో ఉండగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) ప్రతిపక్ష నాయకుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘రాబోయే 30 ఏళ్లైనా మీకు అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. మీరు విదేశాల్లో ఎక్కడో కూర్చుని ఉన్నారు. నా మాట మీకు వినిపించవని నాకు తెలుసు. ఎందుకో కూడా మీరు చెప్పరు. కానీ పర్వాలేదు. అది మీ వ్యక్తిగత జీవితం.. కానీ మీరు ఢిల్లీలో అడుగుపెట్టగానే నా మాట వినండి.
రాబోయే ముప్పు ఏళ్ల వరకు మీ వంతు రాదు’ అని స్పష్టం చేశారు. ఓట్ల దొంగతనం ఆరోపణలపై అమిత్ షా కాంగ్రెస్‌పైనా, దాన్ని మిత్రపక్షాలపైనా ఎదురుదాడి చేశారు. నిరసనలు, ప్రదర్శనల వల్ల ఏమీ సాధిం చలేరు. పలు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ‘మీ కూటమి ఎన్నికల్లో ఓడిపోతూనే ఉంది’ అని ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ఏర్పాటు చేస్తుందని అమిత్ షా అన్నారు. యమునా నది ప్రక్షాళన కోసం రూ. 8,941 కోట్ల విలువైన 43 ప్రాజెక్టులను ప్రారంభిం చిన అనంతరం అమిత్‌షా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై ఎద్దేవా చేశారు.
రాబోయే మూడు దశాబ్దాల పాటు ఆయన పార్టీ అధికారానికి దూరంగానే ఉంటుందని జోస్యం చెప్పారు. బీజేపీ ఓట్ల దొంగతనం ఆరోపణలు చేస్తున్నందుకు షా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై కూడా విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షంపై ఈవీఎం ట్యాంపరింగ్, ఓట్ల దొంగతనం ఆరోపణలు చేశాయ ని, కానీ దశాబ్దాలుగా అనేక రాష్ట్రాల్లో అధికారంలో లేవని షా అన్నారు. ‘మీరు 54 ఏళ్లుగా బెంగాల్లో ఎన్నికల్లో గెలవలేదు.. 12 ఏళ్లుగా అరుణాచల్ ప్రదేశ్‌లో, 18 ఏళ్లుగా ఢిల్లీలో ఎన్నిక కాలేదు’ అని ఆయన ఎత్తి చూపారు.
‘30 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంటుందని నేను చెప్పినప్పుడు, ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ప్రజలకు చెబుతారు. లేకపోతే అమిత్‌షాకు ఎలా తెలుస్తుంది? అని అంటారు. ప్రతి ఆరు నెలలకు విదేశాలకు వెళ్లాల్సిన వారిలా కాకుండా, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే జీవిస్తున్నాను, ఇక్కడే చనిపోతాను’ అని రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. ‘బీజేపీ బూత్ కార్యకర్తల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరకు, లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలకు ప్రజల కష్టాలు తెలుసు. వాటిని పరిష్కరించడానికి వారు తీవ్రంగా కృషి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘నిరసనలు, ప్రదర్శనల వల్ల ఏమీ సాధించలేరు.
మీరు ఎన్నికైన చోటికి ఒక ప్రణాళికను తీసుకురండి’ అని అన్నారు. కాంగ్రెస్, ఆప్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేస్తూ, రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ‘సాకులు చెప్పే రాజకీయాలు’ ఆప్‌ను కాపాడలేవని షా అన్నారు. పంజాబ్‌లోని ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, ఎన్నికలలో ఆప్ ఘోరంగా ఓడిపోతుందని ఆయన పేర్కొన్నారు. యమునా నది కాలుష్యాన్ని ఉదాహర ణగా చూపుతూ, ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నప్పటికీ ఆప్, కాంగ్రెస్ పార్టీలు నదిని శుభ్రపరచడంలో విఫలమయ్యాయని షా ఆరోపిం చారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు నది ప్రవాహ మార్గం పొడవునా దానిని శుభ్రపరిచేందుకు కృషి చేస్తాయని ఆయన ప్రకటించారు.
‘నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి, యమునోత్రి నుంచి సంగమం వరకు యమునా నది మొత్తాన్ని ప్రక్షాళన చేసే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు, ఇటువంటి రాజకీయ ఎత్తుగడలు, మూక పాలనతో దేశ తీర్పును మీరు కాదనలేరు’ అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై బీజేపీ వెంటనే విమర్శనాస్త్రాలు సంధించింది. ఢిల్లీలో జరిగిన నిరసనల సమయంలో ‘అబద్ధాలు అరవడం’తో అలసిపోయిన గాంధీ వారసుడు సెలవుపై వెళ్లారని ఆరోపించింది. ఇందుకు సంబందించి ఒక వీడియోను కూడా ఆ పార్టీ షేర్ చేస్తూ, ‘రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల అజెండా ఏమిటి? అని ప్రశ్నించింది. గాంధీ తన వ్యక్తిగత సమయంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని కాంగ్రెస్ బీజేపీ నేతల వ్యాఖ్యలను కొట్టిపారేసింది.