ప్రత్యక్షంగా కలవడం రాజ్యాంగానికి విరుద్ధం

13-10-2026 | 05:25am

మీరు ప్రస్తావించే అంశాలు ఇప్పటికే విచారణలో ఉన్నాయి 

చట్టానికి లోబడి పిటిషన్లు వేసుకోవచ్చు ఖర్గే, రాహుల్‌కు తేల్చిచెప్పిన సీజేఐ

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణలో ఉన్న అంశాలపై తనను ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రం(Memorandum) అందజేయడం కుదరదని,  ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్(Justice Surya Kant) తేల్చిచెప్పారు. ఆదివారం రాత్రే నిరాకరించినట్లు కథనాలు రాగా.. దానిపై సీజేఐ సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవంలో(National Human Rights Commission Foundation Day) స్పందించారు. ‘నన్ను కలిసి వినతిపత్రం ఇస్తామని ఖర్గే, రాహుల్ నుంచి మెయిల్ వచ్చింది.

కేంద్ర ఎన్నికల కమిషన్ విషయంలో వారు ప్రస్తావిస్తున్న అంశాలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. అలా విచారణలో ఉన్న అంశాలపై సమావేశం కావడం రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి, న్యాయవ్యవస్థలోని నైతిక విలువలకు విరుద్ధం. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై రాజకీయ నేతలతో సమావేశం కావడం సరైంది కాదు. అందుకే వారికి అపాయింట్‌మెంట్ నిరాకరించాను. ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవు.

కావాలంటే వారు కోర్టులో పిటిషన్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు’ అని పేర్కొన్నారు. సీఈసీకి సంబంధించిన అంశాలపై మంగళవారం విచారణ జరగనుందని కూడా గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ అందరికోసం తెరిచే ఉంటాయని, కానీ విచారణ పెండింగ్‌లో ఉండగా న్యాయమూర్తులను ప్రత్యక్షంగా కలవడం మాత్రం అధికార విభజన సూత్రానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రతి భారత పౌరుడి ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు సుప్రీంకోర్టు కట్టుబడి  ఉంది.

చట్టంలో నిర్ధేశించిన విధానాన్ని అనుసరించి హక్కుల కోసం ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు’ అని వెల్లడించారు. సుప్రీంకోర్టులో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నేరుగా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని, ఇదే విషయాన్ని ఖర్గే, రాహుల్‌కు తెలియజేసినట్లు ఆయన వివరించారు. న్యాయస్థానాలను రాజకీయాల్లోకి లాగొద్దని సూచించారు. 

మరిన్ని వార్తలు