విదేశీ కల.. కదనరంగంలో కన్నీటి వ్యథ!
- ఉపాధి వలసల విషవలయం
- రష్యా సైన్యంలో తెలంగాణ యువత బందీలు
- పుట్టగొడుగుల్లా పెరుగుతున్న నకిలీ ఏజెంట్లు
- రాష్ట్రంలో అధికారికంగా 104 మందికే లైసెన్సు
- నకిలీ ఏజెన్సీల నిర్మూలనలో ప్రభుత్వాలు విఫలం
(ఎ.చంద్రశేఖర్ రావు) :
సంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ఉపాధి ఆశ చూపించి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ ఏజెంట్ల మోసాలకు(Fraud by fake agents) నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన తెలంగాణ యువకులు(Telangana youth) రష్యా సరిహద్దుల్లో చిక్కుకుపోవడం అత్యంత ఆందోళనకరం. తైల సంపద కలిగిన కంపెనీల్లో లేదా రష్యా రక్షణ రంగంలో(Russia's defense sector) సహాయక సిబ్బందిగా పౌర ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి, తీరా అక్కడికి వెళ్లాక రష్యా- సరిహద్దు యుద్ధ క్షేత్రంలోకి(Russia – Border Battlefield) బలవంతంగా నెట్టడం మానవ అక్రమ రవాణా కోణాన్ని బహిర్గతం చేస్తోంది.
ఇటీవల కామారెడ్డి జిల్లాకు చెందిన మహ్మద్ అఫ్జల్ ఖాన్(Mohammed Afzal Khan) లాంటి వారు యుద్ధరంగంలో మరణించారనే వార్తలు బాధితుల కుటుంబాల్లో గుండెకోత ను మిగుల్చుతున్నాయి. విదేశాల్లో మెరుగైన జీతం, ఉజ్వల భవిష్యత్తు కోసం కన్న కలలు ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లా లకు చెందిన పలువురు తెలంగాణ యువకులను ప్రాణసంకటంలోకి నెట్టాయి. గార్డెన్ క్లీనర్లు, ఆయిల్ ఫ్యాక్టరీ కార్మికులు, పౌర సహాయక సిబ్బంది పేరుతో ఘరానా ఏజెంట్లు చేసిన మోసానికి బలై, రష్యా- సరిహద్దుల్లోని రష్యా సాయుధ బలగాల సైనిక శిబిరాల్లో చిక్కుకున్న యువకుల ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.
యువత నిస్సహాయత.. ఏజెంట్ల దగా
కరోనా తదనంతర కాలంలో పెరిగిన ఆర్థిక ఇబ్బందులు, స్థానికంగా ఉపాధి కొరతను ఆసరాగా చేసుకుని విదేశీ జాబ్ ఏజెంట్లు ఈ దారు ణానికి ఒడిగట్టారు. లక్షలాది రూపాయలు వసూలు చేసి, రష్యా తీసుకెళ్లిన వెనువెంటనే పాస్‌పోర్టులు, మొబైల్ ఫోన్లు లాక్కొని, బలవం తంగా తుపాకులు చేతికందించి యుద్ధరంగంలోకి దించడం అత్యంత క్రూరమైన చర్య. బాధితులు సోషల్ మీడియా, ఆడియో సందేశాల ద్వారా తమ ప్రాణభయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఈ దారుణమైన సత్యం వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలోనే అఫ్జల్ ఖాన్ లాంటి తెలంగాణ యువకుడు రష్యా- సరిహద్దుల్లో మరణించాడనే వార్తలు మిగిలిన వారి భద్రతపై మరింత ఆందోళన పెంచుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు, పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా నకిలీ ఏజెంట్ల ద్వారా రష్యా సైన్యంలో చేరిన మొత్తం భారతీయుల సంఖ్య 217 నుంచి 227 వరకు ఉంది.
వీరిలో 50 మందికి పైగా భారతీయులు యుద్ధంలో మరణించగా, సుమారు 139 మంది విముక్తి పొందారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 104 మందికి మాత్రమే అధికారిక రిక్రూట్‌మెంట్ లైసెన్సులు ఉండగా, వేల సంఖ్యలో ఉన్న నకిలీ ఏజెంట్లు ఇటువంటి ఘోరమైన మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది.
ముందడుగు పడినా.. ఇంకా ఉంది ప్రయాణం
బాధిత కుటుంబాలు హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ‘ప్రవాసి ప్రజావాణి’ వేదికగా తమ గోడును వెళ్లబోసుకున్నాయి. రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ వైస్-చైర్మన్ మందా భీమ్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి, నిజామాబాద్‌లో గౌరవ్ చౌదరి వంటి అంతరాష్ట్ర ఏజెంట్లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖతో ఉన్నతస్థాయి సంప్రదింపులు జరిపింది.
ఫలితంగా కేంద్రం మద్దతుతో మోసపోయిన సుమారు 11 మంది తెలుగు రాష్ట్రాల యువకులను సురక్షితంగా రష్యా సైన్య విముక్తులను చేసి, స్వదేశానికి రప్పించగలిగారు. కానీ ఇప్పటికీ మరికొందరు యువకులు రష్యా పౌరసత్వం/సైనిక ఒప్పందాల సాంకేతిక పరిమితుల చిక్కుల్లో పడి ఇంకా అక్కడే ఉండిపోయారు. వారిని విడిపించేందుకు దౌత్యపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
ఇకనైనా మారాల్సిన వ్యవస్థ..
ఈ సంక్షోభం కేవలం విదేశీ రెస్క్యూ ఆపరేషన్‌తో ముగిసేది కాదు. దీని వెనుక ఉన్న మూలకారణాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని బాధిత కుటుంబాలు, రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అమాయక యువత ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న గుర్తింపు లేని, నకి లీ రిక్రూట్‌మెంట్ ఏజెంట్ల నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించాలి. గ్రామాల్లో ఉపాధి వలసలపై సమగ్రమైన అవగాహన సదస్సులు నిర్వహిం చాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన వెబ్‌సైట్లు లేదా ఛానెళ్ల ద్వారానే విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా యువతను చైతన్యపరచాలి.
విద్యావంతులైన గ్రామీణ యువత సొంత ఊర్లలోనే గౌరవప్రదమైన జీవనోపాధి పొందేలా రాష్ట్రంలో పారిశ్రామిక, ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. రష్యాలో బందీలైన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డనూ తీసుకురావ డానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ దౌత్య, పరిపాలనాపరమైన ఒత్తిడిని ఏమాత్రం సడలించకూడదు. పౌరుల ప్రాణరక్షణే ముఖ్యమని అంతర్జాతీయ వేదికలపై భారత్ తన గళాన్ని వినిపించాలన్నారు.