యువత రాజకీయాల్లోకి రావాలి
- మహాబూబ్‌నగర్‌కు శ్రీనివాస్‌రెడ్డి ఆఖరు ఎమ్మెల్యే
- బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఏది?
- నిధులు, ఉద్యోగాలు, రిజర్వేషన్లు అన్నింట్లో అన్యాయమే
- అధికారంలోకొస్తే పాలమూరు రంగారెడ్డికి ఎర్ర సత్యం పేరు
- పాదయాత్రలో టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న
పాలమూర్ యూనివర్సిటీ, అక్టోబర్ 12: యువత ఉద్యోగాల(Youth jobs) కోసమే కాకుండా సామాజిక మార్పు(Social Change), విశ్లేషణాత్మక పరిశోధనలపై దృష్టి సారించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అన్నారు. సోమవారం పాలమూరు విశ్వవిద్యాలయంలో(Palamuru University) విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత జెన్ జీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యం అందాలంటే రాజకీయ అధికారంలో భాగస్వాములు కావాలని సూచించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. వెనుకబడిన వర్గాల సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. క్లాక్ టవర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మల్లన్న మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వప్రయోజనాల కోసం ఐదుసార్లు పార్టీలు మారారని విమర్శించారు. బీసీ నాయకుడి ఓబీసీ మండల పదవిని కక్షగట్టి తొలగించారని మండిపడ్డారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లోనూ బీసీలకు అన్యాయమే జరుగుతుందన్నా రు. బీసీల నిధులు, ఉద్యోగాలు, 42 కామారెడ్డి డిక్లరేషన్, 20 లక్షల బీసీల జనాభా తగ్గింపు ఇలా అన్నింట్లో అన్యాయం జరుగుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు తొలగించి ఎర్రసత్యం పేరు పెడతామని మల్లన్న స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ మేధావులు ప్రొఫెసర్ మురళీ మనోహర్, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శేషు, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు దేవళ్ల సమ్మన్న, జిల్లా ఇన్‌చార్జీ మదన్ మోహనాచారి, సతీష్ కొట్టే, డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్, మహిళ అధ్యక్షురాలు పటేల్ వనజక్క, పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.