రాజ్యాంగ వ్యవస్థలపై ఇండీ కుట్రలు

13-10-2026 | 05:30am

గతంలో బోగస్ ఓట్లు తీసేయాలన్నది వారే 

తెలంగాణలో రైతుల కష్టాలను గాలికొదిలేసి ఢిల్లీలో డ్రామాలు

బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్ విమర్శలు

అక్టోబర్ 12 (విజయక్రాంతి): ఎన్నికల్లో ప్రజా మద్దతు కూడగట్టుకోలేక, రాజ్యాంగ వ్యవస్థలపై(Constitutional System) కాంగ్రెస్, ఇండీ కూటమి(Congress, INDIA bloc) కుట్రలకు తెరలేపాయని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డా. కే లక్ష్మణ్(Dr. K Laxman) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బోగస్ ఓట్లు తీసేయాలని గతంలో వారే డిమాండ్ చేశారని పేర్కొన్నా రు. తెలంగాణలో రైతుల కష్టాలను గాలికొదిలేసి ఢిల్లీలో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అక్రమాలను ప్రక్షాళన చేయాలన్నది కాంగ్రెస్ నాయకులేనని గుర్తుచేశారు. మధ్యప్రదేశ్‌లో 60 లక్షల బోగస్ ఓట్లున్నాయని కమల్‌నాథ్, గుజరాత్‌లో 40 లక్షల దొంగ ఓట్లను తొలగించాలని పీసీసీ అధ్యక్షుడిగా శక్తిసింగ్ గోయిల్, ఢిల్లీలో 10 లక్షల నకిలీ ఓట్లున్నాయని అర్విందర్ సింగ్ లవ్‌లీ, 11 లక్షల బోగస్ ఓట్లను తొలగించాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ స్వయంగా ఎన్నికల సంఘానికి గతంలో వినతిపత్రాలిచ్చారని తెలిపారు.

కేరళంలో సీపీఎం దొంగ ఓట్లను తొలగించినందుకు కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల ఎన్నికల సంఘానికి బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. అక్రమంగా నివసించే వారి ఓట్లను తొలగించాలని సచిన్ పైలట్ సైతం గతంలో డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఆనాడు తొలగించాలని డిమాండ్ చేసి, ఇప్పుడు చట్టబద్ధంగా సమగ్ర సవరణ చేపట్టి దొంగ ఓట్లను ఏరివేస్తుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ వీధుల్లోకి రావడం వారి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.

 బ్లాక్‌మెయిల్ రాజకీయాలు..

సుప్రీంకోర్టు స్వయంగా ఓటర్ల సవరణ ప్రక్రియను సమర్థించినప్పటికీ, దాదాపు 42 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు బహిరంగ లేఖ ద్వారా కాంగ్రెస్ నిరాధార ’ఓట్ చోరీ’ ఆరోపణలను తప్పుపట్టినప్పటికీ కాంగ్రెస్ తీరు మారలేదని ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు డోర్లు అందరికీ తెరిచి ఉంటాయని సీజేఐ స్పష్టం చేసినా, వ్యవస్థలను పక్కనబెట్టి సుప్రీంకోర్టు ముందే ధర్నాలు చేస్తామని ప్రకటించడం న్యాయ వ్యవస్థను బ్లాక్‌మెయిల్ చేయడమేనని పేర్కొన్నారు.

రాష్ట్రపతిని కలిసిన ఇండీ కూటమి ఆధారాలు సమర్పిస్తామంటూ రాహుల్ గాంధీ ముఖం చెల్లక తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. జంతర్‌మంతర్ వద్ద నిరసనలపై సాధారణ ప్రజల ఇబ్బందులు, ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఆదేశాల మేరకే ప్రత్యామ్నాయ వేదికలను సూచించారని గుర్తుచేశారు.

అధిష్ఠానం మెప్పు కోసం..

తెలంగాణలో తీవ్ర వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయి, సాగునీరు లేక, 24 గంటల ఉచిత విద్యుత్ రాక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజాసమస్యలను గాలికొదిలేసి అధిష్ఠానం మెప్పు కోసం ఢిల్లీ ధర్నాల పేరిట నాటకాలు ఆడుతున్నారని ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సర్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, దాదాపు 36 లక్షల మంది అన్ని పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల సమక్షంలోనే జరిగిందని, సొంత ప్రభుత్వ ఉద్యోగులపైనే కాంగ్రెస్ నేతలకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు.

కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో గెలిస్తే ప్రజా తీర్పు అని, ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ ద్వంద్వనీతి అని దుయ్యబట్టారు. ఎలక్షన్ కమిషన్ సవరణ ప్రక్రియపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. 25 ఏళ్లుగా మచ్చలేని ప్రజాజీవితం గడుపుతూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాని మోదీ ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు తెలంగాణ సమాజం, దేశ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

కాంగ్రెస్ చరిత్రను తెలుసుకోవాలి..

ఎన్నికల పారదర్శకత గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదని, నేటి యువత (జెన్ జీ, జెన్ ఆల్ఫా) ఆ పార్టీ అసలు చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ సూచించారు. మొదటి సీఈసీ సుకుమార్ సేన్ సోదరుడు అశోక్ సేన్‌ను కాంగ్రెస్ ఎంపీని చేసి న్యాయశాఖ మంత్రి పదవి ఇవ్వడం క్విడ్‌ప్రో కో కాదా అని ప్రశ్నించారు.

సీఈసీ ఆర్‌కే త్రివేది పదవీ విరమణ చేయగానే రాజీవ్ గాంధీ ప్రభుత్వం గవర్నర్ పదవి ఇవ్వడం, టీఎన్ శేషన్‌కు 1999లో ఎల్‌కే అద్వానీపై కాంగ్రెస్ టికెట్ ఇచ్చి పోటీకి పెట్టడం, సీఈసీగా పనిచేసిన ఎంఎస్ గిల్‌ను రాజ్యసభకు పంపి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర క్రీడల మంత్రిని చేయడం కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ అకృత్యాలపై షా కమిషన్ తప్పుపట్టిన నవీన్ చావ్లాను సోనియా గాంధీ ఆదేశాలతో ఎన్నికల కమిషనర్‌గా నియమించారని, ఆయన ఏకపక్ష వైఖరిపై నాటి సీఈసీ గోపాలస్వామి 14 ఆరోపణలతో రాతపూర్వక ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు.

1952లో బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఓడించడానికి కమ్యూనిస్టులతో చేతులు కలిపిన చరిత్ర, 1957లో బెగుసరాయ్‌లో దేశంలోనే మొదటి బూత్ క్యాప్చరింగ్‌కు తెరలేపిన ఘనత కాంగ్రెస్‌దేనని ధ్వజమెత్తారు. బ్యాలెట్ రిగ్గింగ్‌ను అరికట్టడానికే ఈవీఎంలు తెస్తే, ఇప్పుడు మళ్లీ బూత్ క్యాప్చరింగ్ చేసుకోవడానికే బ్యాలెట్ సిస్టమ్ కావాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. 

1980లో సోనియా గాంధీకి భారత పౌరసత్వం రాకముందే న్యూఢిల్లీలో ఓటరుగా నమోదు కావడం వాస్తవం కాదా అని లక్ష్మణ్ నిలదీశారు. ఫారమ్- ద్వారా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకే దేశవ్యాప్తంగా 29 లక్షల బోగస్ ఓట్లను తొలగించారని స్పష్టం చేశారు. దాదాపు 2.89 కోట్ల మంది చనిపోయిన వారి ఓట్లను, అలాగే గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్లి డబుల్ ఎంట్రీ ఉన్న ఓట్లను తొలగిస్తే, చనిపోయిన వారి ఓట్లను కూడా కొనసాగించాలనడం దొంగ ఓట్లతో గెలవాలనే కాంగ్రెస్ దురుద్దేశానికి అద్దం పడుతోందని విమర్శించారు.

మరిన్ని వార్తలు